ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలన ఫలితం నమోదైంది. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన జర్మనీని దక్షిణ అమెరికా జట్టు ఈక్వెడార్‌ చిత్తు చేసింది. గ్రూప్‌–ఇలో భాగంగా జరిగిన కీలక పోరులో ఈక్వెడార్‌ 2–1 తేడాతో జర్మనీపై గెలిచి నాకౌట్‌ దశకు దూసుకెళ్లింది. ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలో ఈక్వెడార్‌కు ఇది రెండోసారి నాకౌట్‌ దశ ప్రవేశం కావడం విశేషం.

కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో జర్మనీ ఆరంభంలోనే ఆధిక్యం సాధించింది. రెండో నిమిషంలోనే జర్మనీ ఆటగాడు లెరోయ్‌ గోల్‌ చేయడంతో స్కోర్‌ 1–0 అయింది. ఈ గోల్‌తో ఈక్వెడార్‌ ఆటగాళ్లు, అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఆ ఆధిక్యం ఎక్కువసేపు నిలవలేదు. ప్రత్యర్థి గోల్‌ నుంచి తేరుకున్న ఈక్వెడార్‌ తొమ్మిదో నిమిషానికే సమాధాన గోల్‌ చేసింది. ఈక్వెడార్‌ ప్లేయర్‌ నిల్సన్‌ చేసిన గోల్‌తో స్కోర్‌ 1–1గా సమమైంది.

మొదటి అర్ధభాగం మిగతా సమయంలో ఇరుజట్లు మరో గోల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం రాలేదు. విరామం నాటికి స్కోర్‌ 1–1గానే నిలిచింది. రెండో అర్ధభాగంలో కూడా పోరు అదే ఉత్కంఠతో కొనసాగింది. చివరికి 77వ నిమిషంలో ఈక్వెడార్‌ ఆటగాడు ప్లేటా మ్యాజిక్‌ చూపించాడు. కార్నర్‌ కిక్‌ను చక్కగా వినియోగించుకుని అద్భుత గోల్‌ సాధించడంతో ఈక్వెడార్‌ 2–1తో ముందంజలోకి వెళ్లింది.

తర్వాత సమీకరణ కోసం జర్మనీ పలు దాడులు చేసినా ఫలితం దక్కలేదు. బంతి ఎక్కువసేపు తమ ఆధీనంలో ఉన్నప్పటికీ జర్మనీ ఆటగాళ్లు గోల్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. మరోవైపు ఈక్వెడార్‌ ఆటగాళ్లు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో రక్షణ బలపరుస్తూ ప్రత్యర్థి దాడులను అడ్డుకున్నారు. మ్యాచ్‌ ముగింపు విజిల్‌ మోగగానే ఈక్వెడార్‌ అభిమానులు ఆనంద బాష్పాలు పెట్టి సంబరాల్లో మునిగిపోయారు.

ఈ మ్యాచ్‌లో రిఫరీ మొత్తం నలుగురు ఆటగాళ్లకు పసుపు కార్డులు చూపించాడు. వారిలో ముగ్గురు ఈక్వెడార్‌ ప్లేయర్లే కావడం గమనార్హం. ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో ఐవరీకోస్ట్‌ కురసావ్‌పై 2–0 తేడాతో గెలిచి నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. ఈ రెండు మ్యాచ్‌లతో గ్రూప్‌–ఇ లీగ్‌ దశ పూర్తయింది.

మొత్తం మూడు మ్యాచ్‌ల్లో తలో రెండు విజయాలతో జర్మనీ, ఐవరీకోస్ట్‌ నేరుగా నాకౌట్‌ దశకు చేరాయి. 4 పాయింట్లు సాధించిన ఈక్వెడార్‌ గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచినా, ఫిఫా కొత్త నిబంధనల ప్రకారం నాకౌట్‌ దశకు అర్హత పొందింది. మొత్తం 12 గ్రూప్‌లలోని 48 జట్లలో ప్రతి గ్రూప్‌ నుంచి తొలి రెండు జట్లు నాకౌట్‌కు వెళ్తాయి. అలాగే ప్రతి గ్రూప్‌లో మూడో స్థానంలో ఉన్న 12 జట్లలో పాయింట్ల ఆధారంగా ఎంపికయ్యే 8 ఉత్తమ జట్లు కూడా నాకౌట్‌ దశలో పోటీపడతాయి.