రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
ఫిఫా తొలి మ్యాచ్‌లోనే 3 రెడ్ కార్డులు..
రిఫరీ విల్టన్ సాంపియోపై తీవ్ర విమర్శలు
ఫిఫా వరల్డ్ కప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో సహ ఆతిథ్య జట్టు మెక్సికో, దక్షిణాఫ్రికాపై 2-0 తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో గోల్స్ కంటే ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది రిఫరీ విల్టన్ సాంపియో తీసుకున్న నిర్ణయాలే.
ఈ పోరులో ఒకేసారి మూడు రెడ్ కార్డులు బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు నేరుగా రెడ్ కార్డులు చూపించడంతో ఆ జట్టు చాలా సేపు కేవలం తొమ్మిది మందితోనే ఆడాల్సి వచ్చింది. ఫలితంగా మ్యాచ్ గమనంపై దీనికి గణనీయమైన ప్రభావం పడిందని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
విల్టన్ సాంపియో నిర్ణయాలే దక్షిణాఫ్రికా ఓటమికి ప్రధాన కారణమని భావించిన కొందరు అభిమానులు, వ్యంగ్యంగా అతనికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రిఫరీపై మీమ్స్ వరదలా కురుస్తుండగా, తొలి మ్యాచ్‌లోనే ఇంత తీవ్ర వివాదం తలెత్తడం బాధాకరమని పలువురు ఫ్యాన్స్ కామెంట్లు చేశారు.
గత ఫిఫా వరల్డ్ కప్ 2022 మొత్తం టోర్నమెంట్‌లో కలిపి కేవలం నాలుగు రెడ్ కార్డులు మాత్రమే రావడం గమనార్హం. కానీ ఈసారి మాత్రం ఆ రికార్డు తొలి మ్యాచ్‌కే దగ్గరపడటం విశేషంగా మారింది. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో, అదీ ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇన్ని రెడ్ కార్డులు ఇవ్వడం అరుదైన సంఘటనగా విశ్లేషకులు చెబుతున్నారు.
సాధారణంగా ఆట నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు రిఫరీ ముందుగా ఎల్లో కార్డు ద్వారా హెచ్చరిక జారీ చేస్తాడు. అదే ప్రవర్తన కొనసాగితే రెండో ఎల్లో కార్డు తర్వాత రెడ్ కార్డు చూపించి ఆటగాడిని మైదానం నుంచి పంపిస్తారు. ఆ ఆటగాడు ఆ మ్యాచ్ మిగతా భాగంలో బరిలోకి తిరిగి రాలేడు. అతని స్థానంలో మరొకరిని కూడా దింపే అవకాశం ఉండదు. అదనంగా, ఆ ఆటగాడిపై తదుపరి మ్యాచ్‌కు నిషేధం విధించే అవకాశం కూడా ఉంటుంది.
కానీ మెక్సికో–దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో మాత్రం ముగ్గురు ఆటగాళ్లకు ఒక్కసారి కూడా ఎల్లో కార్డు చూపించకుండా నేరుగా రెడ్ కార్డులు ఇవ్వడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే ఇలాంటి రికార్డు నమోదవడంతో, రాబోయే మ్యాచ్‌ల్లో రెఫరీల నిర్ణయాలపై మరింత దృష్టి కేంద్రీకృతమయ్యే అవకాశం కనిపిస్తోంది.







