రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో ఆగస్టు 15న ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉందని భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపారు. ఇటీవల టెస్టుల్లో భారత జట్టు ఎదుర్కొన్న వైఫల్యాల నేపథ్యంలో ఈ సిరీస్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
గతేడాది డిసెంబర్‌లో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 0-2 తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ పరాజయానంతరం టెస్టు ఫార్మాట్‌లో జట్టు ప్రదర్శనపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంతో శ్రీలంక పర్యటనను టీమ్‌ఇండియా కీలక పరీక్షగా భావిస్తోంది.
“మా ముందు ఏ పరీక్ష ఉందో తెలుసు. ఎందుకోసం ఆడుతున్నామో తెలుసు. మరింత సత్తా చూపించగలం. అన్ని తప్పులూ దిద్దుకోగలం. ఆగస్టు 15న ఉదయం శ్రీలంకతో తొలి టెస్టులో మా జట్టు తొలుత బ్యాటింగ్ చేసినా.. లేక బౌలింగ్ చేసినా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం” అని గంభీర్ చెప్పారు.
జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్లు దేశం గర్వించే ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నట్లు గంభీర్ పేర్కొన్నారు. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న యువ ఆటగాళ్ల కృషిని ఆయన ప్రశంసించారు.
“భారత టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న కొత్త ఆటగాళ్లు సారాంశ్ జైన్, ఆకిబ్ నబిలకు అభినందనలు. ఈ స్థానానికి చేరడానికి వాళ్లెంతో శ్రమించి ఉంటారు. ఎప్పుడు అవకాశం దొరికినా వాళ్లు దేశం గర్వించేలా ప్రదర్శన చేయాలి” అని గంభీర్ అన్నారు.
రెగ్యులర్ పేస్ బౌలర్ బుమ్రాకు గాయం కావడంతో జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబికి తొలిసారి జాతీయ జట్టులో పిలుపు వచ్చింది. గత సీజన్‌లో జమ్మూకశ్మీర్ రంజీ ట్రోఫీ గెలుపులో ఆకిబ్ కీలకపాత్ర పోషించాడు. మరోవైపు మధ్యప్రదేశ్‌కు చెందిన స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ భారత్-ఎ తరఫున మెరుగైన ప్రదర్శనతో సెలక్టర్లను ఆకట్టుకుని టెస్టు జట్టులో స్థానం సంపాదించాడు.
భారత్-శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈ నెల 15న గాలెలో ఆరంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 23న కొలంబోలో జరగనుంది. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శనతో టెస్టు ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా తిరిగి పుంజుకోవాలని జట్టు యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది.







