రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సి అరుదైన ఘనతను సాధించాడు. ప్రపంచ కప్ పోటీల్లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లోనూ గోల్ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. జోర్డాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మెస్సి గోల్ నమోదు చేయడంతో ఈ రికార్డు అతని ఖాతాలో చేరింది.
ప్రస్తుత ప్రపంచ కప్‌లో అర్జెంటీనా తరఫున మెస్సి చూపుతున్న ప్రదర్శన మరోసారి అతని మాయాజాలాన్ని చాటుతోంది. ఈ టోర్నీలో తాను ఆడిన మొదటి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించిన మెస్సి, జోర్డాన్‌పై కూడా గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. వరుసగా ఏడు ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో గోల్ చేయడం ద్వారా అతడు తన స్థాయిని మరోసారి నిరూపించుకున్నాడు.
జోర్డాన్‌తో జరిగిన పోరులో అర్జెంటీనా 3-1 తేడాతో విజయం సాధించింది. దీంతో లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన అర్జెంటీనా ఇప్పటికే నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా దాడి ఆటకు జోర్డాన్ జట్టు తట్టుకోలేకపోయింది.
ఇక అదే గ్రూప్ Jలో జరిగిన మరో మ్యాచ్‌లో అల్జీరియా, ఆస్ట్రియా జట్లు 3-3తో డ్రా చేసుకున్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో రెండు జట్లు మూడు గోల్స్ చొప్పున నమోదు చేశాయి. అర్జెంటీనాతోపాటు అల్జీరియా, ఆస్ట్రియా జట్లు కూడా నాకౌట్ దశకు చేరుకున్నాయి.
మరోవైపు ఫిఫా ప్రపంచ కప్ 2026లో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. తాను ఆడిన తొలి మ్యాచ్‌లో గోల్ చేయలేకపోయిన రొనాల్డో, తాజాగా కొలంబియాతో జరిగిన పోరులో కూడా గోల్ చేయడంలో విఫలమయ్యాడు.
కొలంబియాతో పోర్చుగల్ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో గ్రూప్ K నుంచి కొలంబియా అగ్రస్థానంతో నాకౌట్ దశకు చేరుకోగా, పోర్చుగల్ రెండో స్థానంతో రౌండ్ 32కు అర్హత సాధించింది. పోర్చుగల్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి ఒక్క విజయమే నమోదు చేయగా, మిగతా రెండు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది.
ఇతర మ్యాచ్‌లలో క్రొయేషియా, ఇంగ్లాండ్, డీఆర్ కాంగో జట్లు తమ తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించగా, క్రొయేషియా 2-1 తేడాతో ఘనాను మట్టికరిపించింది. డీఆర్ కాంగో చేతిలో 3-1 తేడాతో ఓటమి పాలైన ఉజ్బెకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.







