రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
మెక్సికో అద్భుతం.. 40 ఏళ్ల తర్వాత నాకౌట్‌లో తొలి విజయం
అమెరికా, కెనడాతో కలిసి ఫిఫా వరల్డ్ కప్ 2026కు ఆతిథ్యం ఇస్తోన్న సహ ఆతిథ్య దేశం మెక్సికో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మెగా టోర్నీలో ఈ దేశ జట్టు రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 32లో మెక్సికో 2-0 తేడాతో ఈక్వడార్ పై ఘన విజయం సాధించింది.
ఈ విజయంలో ప్రత్యేకత ఏమిటంటే.. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో మెక్సికో 40 ఏళ్ల తర్వాత తొలిసారి నాకౌట్ మ్యాచ్‌లో గెలుపొందడం విశేషం. చివరిసారిగా 1986లోనే ఈ జట్టు నాకౌట్ దశలో విజయం సాధించింది. నాలుగు దశాబ్దాల అనంతరం వచ్చిన ఈ విజయంతో మెక్సికో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి.
ఇంగ్లాండ్ – డ్ర్ కాంగో మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో ప్రీక్వార్టర్స్‌లో మెక్సికో తలపడనుంది. సహ ఆతిథ్య దేశంగా సొంత అభిమానుల మధ్య వరల్డ్ కప్ ఆడుతున్నామనే ధీమా మెక్సికో ఆటగాళ్లలో స్పష్టంగా కనిపించింది. గ్రూప్ స్టేజ్‌లోనూ అగ్రస్థానంతో నాకౌట్ దశకు చేరిన ఈ జట్టు, అక్కడ కూడా అదే దూకుడును కొనసాగించింది.
వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం దాదాపు గంటన్నర ఆలస్యమైంది. అయితే ఆట మొదలైన కొద్దిసేపటికే మెక్సికో ఆధిపత్యాన్ని చాటింది. 22వ నిమిషంలో మెక్సికో ఆటగాడు జులియన్ ఖ్వినోనెస్ తొలి గోల్ నమోదు చేశాడు. ఆ తర్వాత 31వ నిమిషంలో రౌల్ జిమెనెజ్ గోల్‌తో మెక్సికో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
తదుపరి సమయంలో ఇరు జట్లు గోల్ కోసం ప్రయత్నాలు కొనసాగించాయి. అయితే అవకాశాలను సృష్టించడంలో, షాట్లను గురిపెట్టడంలో మెక్సికోనే ముందంజలో నిలిచింది. రక్షణపరంగా కూడా మెక్సికో బలమైన ఆటతీరు ప్రదర్శించడంతో ఈక్వడార్ దాడులను సమర్థవంతంగా అడ్డుకుంది.
ఆట ముగింపు దశకు చేరుకున్న సమయంలో ఆటగాడు ఈక్వడార్ పియారో హిన్‌కాపీ రెడ్ కార్డ్‌ను ఎదుర్కొన్నాడు. దీంతో ఆ జట్టు మరింత ఒత్తిడికి గురైంది. చివరకు నిర్ణీత సమయంలో గోల్స్ నమోదు చేయలేక పోవడంతో ఈక్వడార్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, మెక్సికో చారిత్రాత్మక విజయంతో రౌండ్ ఆఫ్ 16కు చేరింది.
సహ ఆతిథ్య దేశంగా మెక్సికో ఈ విజయంతో టోర్నీలో తన పోరాటాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించేలా బలమైన సంకేతాలు పంపింది. నాలుగు దశాబ్దాల తర్వాత వచ్చిన నాకౌట్ విజయంతో ఈ జట్టు తదుపరి దశల్లో కూడా అదే జోష్‌తో ముందుకు సాగాలని అభిమానులు ఆశాభావాలు వ్యక్తం చేస్తున్నారు.







