పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ: దేశ నాలుగో అత్యున్నత గౌరవం దక్కిన 16వ భారత క్రికెటర్

టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డు దక్కింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రోహిత్ ఈ గౌరవాన్ని స్వీకరించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

ముంబైలో జన్మించిన రోహిత్ శర్మ, అవార్డు ప్రదానోత్సవానికి తన భార్య రితికా సజ్దేతో కలిసి హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో అవార్డు స్వీకరిస్తున్న సమయంలో రోహిత్ ముఖంలో ఆనందం, గర్వం స్పష్టంగా కనిపించాయి. ఈ అవార్డు దక్కిన రోజుకే ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 19 ఏళ్లు పూర్తవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

జూన్ 23, 2007న రోహిత్ శర్మ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. అదే తేదీకి 2026లో పద్మశ్రీ అవార్డు అందుకోవడం ఆయన కెరీర్‌లో అరుదైన సంఘటనగా నిలిచింది. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన రోహిత్, తన తరం బ్యాటర్లలో అత్యంత విజయవంతులలో ఒకరిగా నిలిచారు. వన్డే క్రికెట్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా ఆయన పేరిట ఉన్న ప్రపంచ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో ఉన్న రోహిత్ శర్మ, ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు. ఇప్పుడు ఆయన టీమిండియా తరఫున కేవలం 50 ఓవర్ల వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ తన ఆటను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెబుతున్నారు. తన అద్భుతమైన కెరీర్ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో పద్మశ్రీ రూపంలో వచ్చిన ఈ గౌరవం, రోహిత్‌కు సరైన నివాళిగా భావిస్తున్నారు.

ఈ అవార్డుతో పద్మశ్రీ అందుకున్న అరుదైన భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ కూడా చేరారు. 1982 నుండి ఇప్పటివరకు మొత్తం 16 మంది భారత క్రికెటర్లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ జాబితాలో మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, జులన్ గోస్వామి, యువరాజ్ సింగ్, మిథాలీ రాజ్, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి దిగ్గజాలు ఉన్నారు.

పద్మశ్రీ అందుకున్న భారత క్రికెటర్ల జాబితా ఇలా ఉంది: 1982లో కపిల్ దేవ్, 1999లో సచిన్ టెండూల్కర్, 2004లో రాహుల్ ద్రవిడ్, 2005లో అనిల్ కుంబ్లే, 2009లో ఎంఎస్ ధోనీ, 2010లో వీరేంద్ర సెహ్వాగ్, 2011లో వీవీఎస్ లక్ష్మణ్, 2012లో జులన్ గోస్వామి, 2014లో యువరాజ్ సింగ్, 2015లో మిథాలీ రాజ్, 2017లో విరాట్ కోహ్లీ, 2019లో గౌతమ్ గంభీర్, 2020లో జహీర్ ఖాన్, 2026లో హర్మన్‌ప్రీత్ కౌర్, 2026లో రోహిత్ శర్మ.

అవార్డు కార్యక్రమం ముగిసిన వెంటనే రోహిత్ శర్మ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో భావోద్వేగపూరితంగా స్పందించారు.

జూన్ 23 అన్ని రకాల మ్యాజిక్‌లను మోసుకొచ్చింది. 19 ఏళ్ల క్రితం, ఒక ఇండియా క్యాప్‌తో నా ప్రయాణం మొదలైంది. ఈరోజు, నా లైఫ్ స్టోరీలో మరో గర్వించదగ్గ అధ్యాయం తోడైంది.

భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI కూడా రోహిత్ శర్మ అవార్డు స్వీకరిస్తున్న వీడియోను షేర్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. క్రికెట్ ప్రపంచంలోని గొప్ప దిగ్గజాల్లో ఒకరైన రోహిత్ శర్మకు దేశ అత్యంత ప్రతిష్ఠాత్మక గౌరవాల్లో ఒకటైన పద్మశ్రీ లభించడం పట్ల బోర్డు ఆనందం వ్యక్తం చేసింది.

ఈ అవార్డు ప్రకటించిన సమయంలో దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ తన ఆనందాన్ని పంచుకున్నారు.

పద్మశ్రీ అవార్డు అందుకోవడం నాకు, నా కుటుంబానికి చాలా ప్రత్యేకమైన క్షణం. ఈ గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. నా కెరీర్‌లో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ నేను రుణపడి ఉంటాను. దేశం కోసం మరిన్ని మ్యాచ్‌లు, ట్రోఫీలు గెలవడానికి నా వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. థాంక్యూ.. జై హింద్.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఇటీవల వైట్ బాల్ క్రికెట్‌లో గణనీయమైన విజయాలు సాధించింది. 2024లో సౌతాఫ్రికాను ఓడించి టీ20 వరల్డ్ కప్, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషించింది. ఈ విజయాలతో వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకరిగా నిలిచారు.