రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. ఆరు ప్రపంచకప్పుల్లో గోల్ చేసిన తొలి ఆటగాడిగా తన పేరును నమోదు చేసుకున్నాడు. ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన గ్రూప్–కె మ్యాచ్‌లో రెండు గోల్స్ నమోదు చేసి ఈ రికార్డు సృష్టించాడు.
మంగళవారం జరిగిన ఈ పోరులో పోర్చుగల్ 5–0 తేడాతో ఉజ్బెకిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే పోర్చుగల్ దూకుడుగా ఆడి ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. గోల్‌పోస్ట్‌పై వరుస దాడులతో ఉజ్బెకిస్థాన్ రక్షణను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది.
రొనాల్డో 6వ నిమిషంలో తొలి గోల్ చేసి జట్టుకు ఆధిక్యం తీసుకొచ్చాడు. అనంతరం 17వ నిమిషంలో నునో మెండెస్ మరో గోల్ నమోదు చేయడంతో పోర్చుగల్ ఆధిక్యం మరింత బలపడింది. హాఫ్‌టైమ్‌కు ముందు 39వ నిమిషంలో రొనాల్డో తన రెండో గోల్ సాధించాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి పోర్చుగల్ 3–0తో ముందంజలో నిలిచింది.
రెండోార్థంలో కూడా పోర్చుగల్ దాడులు కొనసాగించగా, ఉజ్బెకిస్థాన్ ఆటగాడు నెమతోవ్ 60వ నిమిషంలో సెల్ఫ్ గోల్ చేశాడు. దీంతో పోర్చుగల్ ఆధిక్యం 4–0కు చేరింది. మ్యాచ్ ముగింపు దశలో 87వ నిమిషంలో రఫేలియో మరో గోల్ చేసి స్కోర్‌ను 5–0గా మలిచాడు.
ఈ మ్యాచ్ మొత్తం వ్యవధిలో పోర్చుగల్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బంతి పట్టు, పాస్‌లు, గోల్ అవకాశాల సృష్టిలో పోర్చుగల్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. ఉజ్బెకిస్థాన్ జట్టు రక్షణను పలుమార్లు ఛేదించేందుకు ప్రయత్నించినప్పటికీ, పోర్చుగీస్ ఆటగాళ్ల సమన్వయం, వేగం ముందు నిలవలేకపోయింది.
కాంగో డీర్‌తో ఆడిన తొలి గ్రూప్ మ్యాచ్‌ను పోర్చుగల్ 1–1తో డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కోల్పోయిన పాయింట్లను ఈ విజయంతో కొంతమేర భర్తీ చేసినట్టైంది. ఉజ్బెకిస్థాన్‌పై భారీ తేడాతో గెలవడంతో పోర్చుగల్ గోల్ తేడా మెరుగుపడింది. తదుపరి మ్యాచ్‌లకు ముందు జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.
ఈ విజయంతో పాటు రొనాల్డో సాధించిన చారిత్రక రికార్డు ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఆరు ప్రపంచకప్పుల్లోనూ గోల్ చేయడం ద్వారా రొనాల్డో తన స్థాయిని మరోసారి చాటుకున్నాడు.







