రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
ఇంగ్లాండ్ గడ్డపై టీమ్ఇండియాకు పరీక్ష..
వైభవ్ అరంగేట్రంపై ఆసక్తి
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఓటమి నుంచి ఇంకా పూర్తిగా తేరుకోని టీమ్ఇండియా మరో కీలక సిరీస్‌కు సిద్ధమైంది. ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఐర్లాండ్ వంటి పసికూన జట్టుకూడా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ను ఓడించడంతో టీమ్ఇండియా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ఇప్పుడు బలమైన ఇంగ్లాండ్‌ను వారి సొంత గడ్డపై ఎలా నిలువరించబోతుందనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.
ఐర్లాండ్‌పై సిరీస్‌కు ముందు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని క్రికెట్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ సిరీస్‌లో అతనికి అవకాశం రాకపోవడంతో టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లాండ్‌పై సిరీస్‌లో మాత్రం ఈ కుర్ర ఆటగాడికి అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బుధవారం జరిగే తొలి టీ20లోనే వైభవ్ అరంగేట్రం చేసే అవకాశాలు బలంగా ఉన్నాయని జట్టు వర్గాలు భావిస్తున్నాయి.
ఐర్లాండ్‌పై సిరీస్‌లో విఫలమైన సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌లలో ఒకరిని బెంచ్‌కే పరిమితం చేసి, అభిషేక్ శర్మతో కలిసి వైభవ్‌ను ఓపెనింగ్‌కు పంపే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అవకాశం దక్కితే వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడన్నది అభిమానుల్లో ఆసక్తికర అంశంగా మారింది.
ఐపీఎల్ 2026లో ప్రపంచ స్థాయి బౌలర్ల బౌలింగ్‌ను సైతం ఊచకోత కోసిన వైభవ్, పేస్‌కు అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్‌లపై ఎలా ఆడతాడో చూడాలి. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌ను ఎదుర్కొనే సమయంలో అతడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు వీరిద్దరూ కలిసి ఆడినందున వైభవ్ బలహీనతలు, బలాలు ఆర్చర్‌కు బాగా తెలిసి ఉండే అవకాశముంది.
ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, జోర్డాన్ కాక్స్, జాకబ్ బెతెల్, విల్ జాక్స్, ఫిల్ సాల్ట్, టామ్ బాంటన్ వంటి శక్తివంతమైన ఆటగాళ్లతో బలంగా కనిపిస్తోంది. వీరిని అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, శివమ్ దూబె, ప్రిన్స్ యాదవ్‌లతో కూడిన భారత పేస్ దళం ఎలా కట్టడి చేస్తుందో కీలకంగా మారింది.
తొలి టీ20కు ఆతిథ్యం ఇవ్వనున్న చెస్టర్-లె-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్ మైదానం బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ గత ఎనిమిది టీ20 మ్యాచ్‌ల్లో బౌలర్లదే ఆధిపత్యం నమోదైంది. సగటు స్కోరు 138 పరుగులు కాగా, అత్యధిక స్కోరు 195గా ఉంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలకు ప్రారంభం కానుంది.
ఐదు టీ20ల సిరీస్ కోసం ఇరు జట్ల వివరాలు ఇలా ఉన్నాయి:
భారత్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, సూర్యాంశ్ షెడ్గే, ప్రసిద్ధ్ కృష్ణ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబె, ప్రిన్స్ యాదవ్.
ఇంగ్లాండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెతెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.







