రాయలసీమ న్యూస్, తమిళనాడు డెస్క్:
కరూర్ తొక్కిసలాట రాజకీయ కుట్రే:
సీఎం విజయ్ విమర్శ
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కరూర్ తొక్కిసలాట దుర్ఘటనపై మరోసారి స్పందించారు. ఆ ఘటన కచ్చితంగా రాజకీయ కుట్ర ఫలితమని వ్యాఖ్యానించారు. ర్యాలీకి భారీగా జనసందోహం చేరిన విషయం పోలీసులకు తెలిసినా, సమావేశాన్ని మధ్యలోనే రద్దు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తాను పోలీసులను నమ్మినందుకే చివరికి మరణాలకు తననే బాధ్యుడిగా నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం హోదాలో తొలిసారి కరూర్‌లో పర్యటించిన విజయ్.. అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొని, గత ఏడాది జరిగిన తొక్కిసలాట దుర్ఘటనను స్మరించుకున్నారు. ఆ సందర్భంలో కొంత భావోద్వేగానికి గురయ్యారు. తన రాజకీయ ప్రయాణంలో కరూర్ ఘటన ఎంతో బాధాకరమైన మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు.
ఒక మనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించినా సరే.. తన జీవితంలో ఎక్కడో ఓ చోట బాధాకరమైన క్షణాలను ఎదుర్కోక తప్పదు. నా రాజకీయ ప్రయాణంలో కరూర్ ఘటన అలాంటిదే. ఆ తొక్కిసలాటలో ఎంతోమంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారు. దీనికి బాధ్యులెవరు? ఆ రోజు ర్యాలీకి రద్దీ ఎక్కువగా ఉందని పోలీసులకు అనిపించినప్పుడు మమ్మల్ని అలర్ట్ చేయాల్సింది. లేదా సమావేశాన్ని రద్దు చేయాల్సింది. వారికి అన్ని హక్కులూ ఉన్నాయి కదా..! కానీ, అవేవీ చేయకుండా వారు చోద్యం చూశారు. బహుశా అలా చేయమని వారిపై ఎవరి ఒత్తిడైనా ఉండి ఉంటుంది. రద్దీని నియంత్రించగలరని నేను పోలీసులను నమ్మాను. కానీ, నా వల్లే మరణాలు జరిగాయని నాడు నాపై నిందలేశారు. ఘటన తర్వాత నేను పారిపోయానని ప్రత్యర్థులు నాపై బురదజల్లారు. కానీ, నేను పారిపోలేదు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా
కరూర్ విషాదాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని విజయ్ స్పష్టం చేశారు. మృతుల జ్ఞాపకార్థం పార్టీ తరఫున ప్రత్యేక స్మారకాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించే తన హామీని అమలు చేస్తూ, అర్హులైన వారికి నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇటీవల జరిగిన రాజకీయ ప్రయత్నాలపై కూడా విజయ్ స్పందించారు. ప్రజలు తనవైపు ఉన్నారని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తమ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించలేరని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాయని, తమ హయాంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పేరే వినిపించదని విమర్శించారు. ఒక్క పైసా కూడా లంచం తీసుకోకుండా నిజాయతీతో ప్రజలకు సేవలందిస్తున్నామని పేర్కొన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో గత ఏడాది సెప్టెంబరులో కరూర్‌లో జరిగిన ఈ తొక్కిసలాట దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. విజయ్ ఎన్నికల ప్రచారం కోసం టీవీకే పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన అనంతరం బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని విజయ్ ప్రకటించగా, ఇప్పుడు ఆ హామీని అమలు చేశారు.







