కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ నీటిలో తమ వాటాను విడుదల చేయడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జలాలను విడుదల చేసేలా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరింది. 

తమిళనాడుకు 15 రోజుల పాటు రోజూ 3500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ నదీజలాల నిర్వహణ అథారిటీ జులై 28న కర్ణాటక (Karnataka) ప్రభుత్వాన్ని ఆదేశించింది. కావేరీ బేసిన్‌లోని నీటి లభ్యత, వర్షపాత పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొనడంతో.. తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు, కన్నడ సంఘాలు నిరసనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయ్‌ సర్కార్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

మరింత తీవ్రంగా నిరసనలు: ఎంకే స్టాలిన్‌

కావేరీ నదీ జలాలు జూన్ 12 నాటికి రాష్ట్రానికి చేరాల్సి ఉన్నప్పటికీ ఇంకా చేరలేదని డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) పేర్కొన్నారు. రాష్ట్ర రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే నిరసనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ విషయంపై విజయ్‌ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రంలో తన సినిమా ప్రదర్శనను నిలిపివేయకుండా ఉండడం కోసం రైతుల జీవితాలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు.