‘తిరుచ్చి ఈస్ట్‌’ ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన నటుడు

కొరియోగ్రాఫర్‌, నటుడు, దర్శకుడిగా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్‌ ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారనే ప్రచారం సోషల్‌ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో లారెన్స్‌ స్వయంగా స్పందించారు.

ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన పెరంబూర్‌ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా కొనసాగేందుకు ఎంచుకుని, తిరుచ్చి ఈస్ట్‌ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో అక్కడ త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో విజయ్ నేతృత్వంలోని టివీకె తరఫున రాఘవ లారెన్స్‌ బరిలోకి దిగుతారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారంపై స్పష్టత ఇవ్వాలంటూ పలు మీడియా సంస్థల ప్రతినిధులు లారెన్స్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన X వేదికగా ఒక పోస్ట్‌ పెట్టారు.

లారెన్స్‌ ఈ వ్యాఖ్యలతో తిరుచ్చి ఈస్ట్‌ నుంచి పోటీ విషయంపై నేరుగా సమాధానం ఇవ్వకపోయినా, గురువారం ఉదయం చేయబోయే ముఖ్య ప్రకటనపై ఆసక్తి పెరిగింది. ఆయన రాజకీయాల్లోకి అధికారికంగా అడుగుపెడతారా? లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో కీలక నిర్ణయాన్ని వెల్లడిస్తారా? అన్న దానిపై అభిమానులు, సినీ వర్గాలు, రాజకీయ పరిశీలకులు దృష్టి సారించారు.

రాఘవ లారెన్స్‌ నటనతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా ఉంటారు. తన తల్లి పేరుతో అనాథలు, వృద్ధులకు సహాయం చేస్తూ వస్తున్న ఆయన, సాయం కోసం తనను సంప్రదించే వారిని చేతనైనంతగా ఆదుకుంటారన్న పేరు తెచ్చుకున్నారు. సోషల్‌ మీడియా ద్వారా సహాయం కోరిన వారిని కూడా తన టీమ్‌, స్నేహితుల సహకారంతో వెతికి సాయం అందించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి నేపథ్యంతో లారెన్స్‌ రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తనకు ఎంతో ఇష్టమైన గురువారం రోజున ఏ ప్రకటన చేయబోతున్నారన్న దానిపై ఇప్పుడు అందరి చూపు నిలిచింది.