తమిళనాడు రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున మధురై - తిరుచ్చి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఓమ్ని బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తిరుచ్చి వైపు వెళ్తున్న తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ (TNSTC) బస్సును మార్థాండం వైపు వెళ్తున్న ఓమ్ని బస్సు కొత్తంపట్టి సమీపంలో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న మొత్తం ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది గాయపడ్డారు.

సమాచారం అందిన పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.