రాయలసీమ న్యూస్, టెక్నాలజీ డెస్క్:
ఆంత్రోపిక్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం..
50 వేల మందికి క్లాడ్ AI శిక్షణ
ఐటీ రంగంలో అగ్రగామి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కృత్రిమ మేధస్సు రంగంలో కీలక అడుగు వేసింది. ప్రపంచంలో అత్యంత విలువైన AI కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందిన గ్లోబల్ స్టార్టప్ ఆంత్రోపిక్ తో TCS గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ కుదుర్చుకుంది. ప్రయోగాత్మక స్థాయిని దాటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీలకు విస్తృత స్థాయిలో AI సేవలను అందించడమే ఈ భాగస్వామ్య లక్ష్యంగా వెల్లడించారు.
ఈ ఒప్పందం భాగంగా ఆంత్రోపిక్ కు చెందిన ప్రముఖ AI మోడల్ క్లాడ్ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు, దాని ఆధారంగా పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి TCS ప్రత్యేక బిజినెస్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్ ద్వారా వివిధ రంగాల కస్టమర్లకు క్లాడ్ ఆధారిత సొల్యూషన్లు, సేవలను అందించే దిశగా సంస్థ ముందుకు సాగుతోంది.
ఈ భాగస్వామ్యంలో అత్యంత ముఖ్యాంశంగా TCS తన సంస్థలోని ఇంజనీరింగ్, ఫైనాన్స్, లీగల్, మార్కెటింగ్, సేల్స్ విభాగాలకు చెందిన 50 వేల మంది ఉద్యోగులకు క్లాడ్ AI మోడల్స్ వినియోగంపై సమగ్ర శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. కేవలం కస్టమర్ల ప్రాజెక్టులకే కాకుండా, సంస్థ అంతర్గత అవసరాల కోసం కూడా ఈ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించేందుకు TCS ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రక్రియలో లభించే అనుభవంతో కస్టమర్లకు మరింత మెరుగైన, సమర్థవంతమైన సేవలు అందించవచ్చని సంస్థ అంచనా వేస్తోంది.
TCS iON ప్లాట్‌ఫారమ్ ద్వారా క్లాడ్ AI మోడల్స్‌పై లెర్నింగ్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను కూడా అందించేందుకు సంస్థ సిద్ధమవుతోంది. దీంతో AI రంగంలో నైపుణ్యాల పెంపుదలకు, కొత్త టాలెంట్ తయారీలో ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, ఏవియేషన్, టెలికాం వంటి రంగాల్లో ప్రభుత్వ నియంత్రణలు కఠినంగా ఉండటం వల్ల, అక్కడ AI వినియోగంపై సంస్థలు సాధారణంగా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టాలకు దారితీసే అవకాశం ఉండటంతో, ఈ రంగాల్లో AI అమలుపై కొంత వెనుకంజలో ఉంటారు. ఇప్పుడు TCS–Anthropic భాగస్వామ్యం ప్రత్యేకంగా ఇలాంటి రంగాలనే లక్ష్యంగా పెట్టుకుంది. క్లాడ్ AI ఖచ్చితత్వం, నమ్మకత్వానికి TCS పరిశ్రమ అనుభవం తోడవడంతో, ఈ రంగాల్లోని పెద్ద కంపెనీలు భయాందోళనల లేకుండా AI ప్రాజెక్టులను పైలట్ దశ దాటి లైవ్ దశకు తీసుకురావడంలో ఈ జోడీ సహాయపడనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
భారతదేశం తమకు రెండో అతిపెద్ద మార్కెట్ అని, TCSతో భాగస్వామ్యం తమ ఇండియా స్ట్రాటజీలో కీలకమని ఆంత్రోపిక్ సీఈఓ Dario Amodei పేర్కొన్నారు.
ఈ ఒప్పందానికి రెండు రోజుల ముందే టాటా సన్స్ ఛైర్మన్ N. చంద్రశేఖరన్ , వచ్చే మూడు సంవత్సరాల్లో TCSలో ఉన్న టెక్కీల సంఖ్యకు సమానంగా AI ఏజెంట్లు కూడా ఉంటారని అంచనా వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలో ఆంత్రోపిక్ తో కుదిరిన ఈ డీల్, ఆయన వెల్లడించిన ఆ ధైర్యవంతమైన విజన్‌కు పునాది వేస్తోందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఐటీ రంగంలో నియామకాలు మందగించినప్పటికీ, AI టాలెంట్‌కు ఉన్న భారీ డిమాండ్‌ను ఈ భాగస్వామ్యం మరోసారి స్పష్టంగా చూపించింది.







