పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్‌కు న్యాయస్థానం నుంచి ఊరట లభించింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడైన భగీరథ్‌కు మల్కాజ్‌గిరి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత నెల రోజులుగా జైల్లో ఉన్న భగీరథ్ విడుదలకు మార్గం సుగమమైంది.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ శివారులోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మే 8వ తేదీ రాత్రి బండి భగీరథ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదుైంది. ఒక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి 17 ఏళ్ల మైనర్ బాలికపై భగీరథ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అత్యాచారానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి.

ఈ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పోలీసులు కేసును ప్రాధాన్యంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు భాగంగా మే 16వ తేదీ రాత్రి బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని మేడ్చల్ జిల్లా జడ్జి నివాసంలో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల న్యాయహిరాసత్ విధించారు. ఆ తర్వాత భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు.

అప్పటి నుంచి దాదాపు నెల రోజులుగా చర్లపల్లి జైలులోనే రిమాండ్‌లో ఉన్న భగీరథ్ తరఫు న్యాయవాదులు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న మల్కాజ్‌గిరి కోర్టు, కేసు పరిస్థితులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించిన అనంతరం నిందితుడికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరుకు సంబంధించి కోర్టు విధించిన షరతుల వివరాలు మాత్రం వెంటనే వెలుబడలేదు.

పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, భగీరథ్‌కు బెయిల్ మంజూరు కావడం రాజకీయ వర్గాల్లో, న్యాయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కేసు తదుపరి విచారణలో ఏమేరకు మలుపులు తిరుగుతుందన్న దానిపై ఇప్పుడు దృష్టి కేంద్రీకృతమైంది.