రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠినమైన, స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. మూసీ నదిని శుద్ధి చేసి, పునరుజ్జీవింపజేయడం తన జీవితకాల లక్ష్యమని, ఈ ప్రక్షాళనను దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
మూసీ ప్రక్షాళనతో పాటు తెలంగాణ రాజకీయ భవిష్యత్తు, అభివృద్ధి దిశపై కూడా సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. 2024 నుంచి 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని, రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఆదివారం నాడు సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా హ్యామ్ రోడ్ల శంఖుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఎన్జీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలోపు SLBC ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. అలాగే డిండి ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని చెప్పారు. SLBC, డిండి, నక్కల గండి ప్రాజెక్టులు నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షలని ఆయన గుర్తుచేశారు.
గత BRS ప్రభుత్వం పదేళ్ల పాటు SLBC ప్రాజెక్టును నిర్లక్ష్యానికి గురి చేసిందని, ఆ కాలంలో కనీసం 10 కిలోమీటర్లు కూడా సొరంగం తవ్వలేదని సీఎం రేవంత్ విమర్శించారు. BRS పదేళ్లు తెలంగాణను పాలించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఆ పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసం సృష్టించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRS నేతలు త్యాగాల గురించి మాట్లాడుతున్న తీరు పట్ల కూడా సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. త్యాగాలు అంటే రాజీనామాలు చేయడం, ఎలక్షన్స్ తేవడం, కలెక్షన్స్ చేయడమా అని ఆయన ఎద్దేవా చేశారు. నిజమైన త్యాగాలు చేసిన నేతలుగా కొండా లక్ష్మణ్ బాపూజీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీకాంత్ చారి పేర్లు ప్రస్తావించారు.
తెలంగాణ కోసం తొలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని త్యజించారని, మలిదశ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకునేలా తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్ష కూడా చేశారని ఆయన పేర్కొన్నారు.
వందల మంది త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగా, ఆ త్యాగాలను TRS నాయకులు తమ ఖాతాలో వేసుకున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టే తెచ్చుకున్న వాళ్లు త్యాగాలు గురించి మాట్లాడుతున్నారని, ఈ వ్యాఖ్యలతో హరీష్ రావును పరోక్షంగా ఎద్దేవా చేశారు.
ఎంతో మంది త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తే, పదవులు మాత్రం KCR కుటుంబం మాత్రమే అనుభవించిందని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకున్నందుకు ప్రజలు KCR ఫ్యామిలీని బహిష్కరించారని ఆయన అన్నారు.







