పార్టీ కార్యక్రమాలపై పూర్తి స్థాయి దృష్టి పెట్టేందుకు గాంధీభవన్‌లో రాజకీయ రద్దీకి బ్రేక్‌ వేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ కీలక నేతలకు స్పష్టం చేశారు. పదవుల కోసం గాంధీభవన్‌కు వచ్చే వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దని ఆయన సూచించారు.

సర్‌పై నిర్వహించిన జూమ్‌ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఇన్‌ఛార్జిలు, ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక సూచనలు చేస్తూ, రేపటి నుంచి ఆగస్టు 3 వరకు నేతలు గాంధీభవన్‌కు రావొద్దని స్పష్టం చేశారు. కొందరు నేతలు హైదరాబాద్‌లోనే కూర్చొని క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

ఎస్‌ఐఆర్‌ గడువు ఆగస్టు 3 వరకు పొడిగించారని, ఈ కాలంలో ఇన్‌ఛార్జి మంత్రులు అన్ని జిల్లాల్లో సర్‌పై సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇప్పటివరకు సర్‌పై 489 భేటీలు జరిగాయని, ఇంకా వెనుకబడిన నియోజకవర్గాల్లో నేతలు తక్షణం స్పందించాలని ఆయన సూచించారు.

సర్‌ కార్యక్రమం అమలులో బీఎల్‌వో, బీఎల్‌ఏల పాత్రపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. బీఎల్‌వోల నివేదికల కంటే బీఎల్‌ఏల రిపోర్టులను ప్రాధాన్యంగా పరిశీలించాలని, బీఎల్‌వోల నివేదికలపై మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్‌ఏలను నేతలు సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.

నేతలు పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండి, వచ్చే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలని సీఎం ఆదేశించారు. సర్‌కు నియమించిన పార్టీ ఇన్‌ఛార్జిలు తప్పనిసరిగా ప్రజల మధ్య ఉండి పర్యటనలు నిర్వహించాలన్నారు. ఈనెల 30న మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించి, పనితీరు ఆధారంగా నేతలను అంచనా వేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని సమన్వయం చేయాలని సీఎం సూచించారు. సర్‌ కార్యక్రమాన్ని పార్టీ బలోపేతానికి, ప్రజలతో అనుబంధం పెంచుకునేందుకు అవకాశంగా మలుచుకోవాలని ఆయన నేతలకు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.