రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: నగరంలో జరగనున్న వివిధ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడానికి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పి.టి. ఉష హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది.
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) ఛైర్మన్ శివసేనారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎ. సోనీ బాలాదేవి, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డా. కిషోర్ గోపీనాథ్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు విమానాశ్రయంలో పి.టి. ఉషకు స్వాగతం పలికారు. క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేశారు.
గురువారం రాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో పి.టి. ఉష పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ఫిజికల్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో, వెబ్‌సైట్‌ను ఆమె ఆవిష్కరించనున్నారు. అదే కార్యక్రమంలో ఈ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అందించనున్న వివిధ కోర్సులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పారా క్రీడల అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల భాగంగా పారా నేషనల్ పారా అథ్లెటిక్ సపోర్ట్ ప్రోగ్రామ్‌ను ప్రకటించనున్నట్లు శాట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో నిర్వహించబోయే నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 వివరాలను కూడా అదే వేదికపై వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు.
క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలోని వివిధ జిల్లా కేంద్రాల్లో అమలు చేయబోయే స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని గురువారమే ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా క్రీడా అవగాహన, శిక్షణను గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రత్యేక వాహనాలను సిద్ధం చేశారు.
ఇక గురువారం ఉదయం నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఆధునికీకరించిన తెలంగాణ ఒలింపిక్ భవన్‌ను పి.టి. ఉష రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభించనున్నారు. కొత్త భవనంలో క్రీడా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, పరిపాలన సంబంధిత కార్యకలాపాలకు అవసరమైన సదుపాయాలను కల్పించినట్లు అధికారులు తెలిపారు.
పి.టి. ఉష పర్యటనతో నగర క్రీడా వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువ క్రీడాకారుల ప్రోత్సాహంపై ఈ సందర్శన సానుకూల ప్రభావం చూపుతుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.







