టాస్మాక్‌ దారిమళ్లింపులపై సీఎం విజయ్‌ సీరియస్‌

– పార్టీ ఫండ్‌ అక్రమ వసూళ్లకు చెక్‌

తమిళనాడులో మద్యం విక్రయాల ద్వారా పార్టీ ఫండ్‌ పేరుతో జరుగుతున్న భారీ దారిమళ్లింపులపై సీఎం విజయ్‌ కఠినంగా స్పందించారు. ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు మద్యం ప్రధాన ఆదాయ వనరుగా మారిన నేపథ్యంలో, టాస్మాక్‌ వ్యవస్థలో నెలకొన్న అవినీతి, అక్రమ వసూళ్లపై ఆయన దృష్టి సారించారు.

తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ (TASMAC) ద్వారా లిక్కర్‌ వసూళ్లలో నుంచి దారి మళ్లిన రూ.1600 కోట్ల పార్టీ ఫండ్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో సీఎం విజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం (జూన్‌ 5) జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో పార్టీ ఫండ్‌ పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన మంత్రివర్గానికి స్పష్టం చేశారు.

టాస్మాక్‌ వెనుక జరుగుతున్న అవినీతి, అక్రమ వసూళ్లపై సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లిక్కర్‌ కలెక్షన్ల నుంచి నెలకు సుమారు రూ.102 కోట్లను పార్టీ ఫండ్‌ రూపంలో దారి మళ్లిస్తున్న విషయాన్ని ప్రభుత్వం అత్యంత గంభీరంగా తీసుకుంది. టాస్మాక్‌ను DMK పార్టీ ఎలా దుర్వినియోగం చేసిందో పూర్తిగా వెలికితీసే దిశగా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.

టాస్మాక్‌ ఆధ్వర్యంలో ఉన్న హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాల్లోనే ఈ అక్రమ వసూళ్ల దందా సాగుతున్నట్లు అధికారుల నివేదికల్లో వెల్లడైంది. మొత్తం 4,048 ఔట్‌లెట్లు టాస్మాక్‌ పరిధిలో ఉన్నాయి. ఈ వ్యవస్థలో గత 20 ఏళ్లుగా అనధికార వసూళ్ల రాజ్యం నడుస్తోందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు గుర్తించారు. ఎక్సైజ్‌ శాఖ మంత్రి కే.విగ్నేష్‌ తొలిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, శాఖలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని సంకల్పం వ్యక్తం చేశారు. కేబినెట్‌ సమావేశంలో సీఎం విజయ్‌ ప్రభుత్వానికి అవినీతి రూపంలో వచ్చే డబ్బు, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఆదాయం అవసరం లేదని స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఎక్సైజ్‌ శాఖ వివరాల ప్రకారం, టాస్మాక్‌ సప్లై చైన్‌లో మద్యం కాటన్లపై నిర్దిష్ట రేట్లతో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయి. లిక్కర్‌ కాటన్‌పై రూ.90, 12 బాటిళ్ల బీర్‌ కాటన్‌పై రూ.40, వైన్‌ కాటన్‌పై రూ.20 చొప్పున వసూలు చేసి, ఈ మొత్తాన్ని పార్టీ ఫండ్‌ కింద దారి మళ్లిస్తున్నట్లు తేలింది. వేర్‌హౌస్‌లు, రవాణా దశలో, ఔట్‌లెట్ల వద్ద ఈ వసూళ్లు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. టాస్మాక్‌ ద్వారా ప్రతి నెల సుమారు 88 లక్షల మంది వినియోగదారులు మద్యం కొనుగోలు చేస్తున్నారని, ఈ లెక్కల ప్రకారం నెలకు రూ.102 కోట్ల వరకు అనధికారికంగా దారి మళ్లింపులు జరుగుతున్నాయని అంచనా. ఈ వివరాలు తెలుసుకున్న సీఎం విజయ్‌ ప్రతి శాఖలో ఇలాంటి అక్రమ వసూళ్లు, దారిమళ్లింపులను గుర్తించాల్సిందిగా సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు.

గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవకతవకలను వెలికితీసేందుకు ముందుగా టాస్మాక్‌ శాఖపై సీఎం ఫోకస్‌ పెట్టారు. తదుపరి లక్ష్యంగా మైనింగ్‌ శాఖను కూడా పరిశీలించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. సీఎం విజయ్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 717 లిక్కర్‌ షాపులను మూసివేయించిన విషయం తెలిసిందే. స్కూల్స్‌, కాలేజీలు వంటి విద్యాసంస్థల పరిసరాల్లో ఉన్న వైన్స్‌ షాపులను మూసివేయడంతో రాష్ట్రానికి సుమారు రూ.8 వేల కోట్ల ఆదాయం నష్టం కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయం తీసుకున్న సీఎం, ఇప్పుడు టాస్మాక్‌లో జరిగిన అవకతవకలపై చర్యలకు సిద్ధమవుతున్నారు.