ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలులోకి రానుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘అన్నదాత సుఖీభవ’ (ADSB), కేంద్ర ప్రభుత్వ ‘ప్రధాన్ మంత్రి కిసాన్’ (PM-KISAN) పథకాల సంయుక్త తొలి విడత ఆర్థిక సహాయాన్ని ఈరోజు మధ్యాహ్నం అధికారికంగా విడుదల చేయనున్నట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.

నెల్లూరు జిల్లావ్యాప్తంగా అర్హులైన వేలాది మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు నేరుగా జమ కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,77,545 మంది రైతులు ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద, 1,41,921 మంది రైతులు ‘పీఎం-కిసాన్’ 23వ విడత కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హత సాధించినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సంయుక్త కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ‘అన్నదాత సుఖీభవ’ కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.5,000 చొప్పున, కేంద్ర ప్రభుత్వ ‘పీఎం-కిసాన్’ పథకం కింద రూ.2,000 చొప్పున నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానంలో జమ చేయనున్నారు.

నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల సంఖ్య, విడుదలవుతున్న నిధుల వివరాలను కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారికంగా ప్రకటించారు. ఉదయగిరి నియోజకవర్గంలో ‘అన్నదాత సుఖీభవ’ కింద 45,275 మంది, ‘పీఎం-కిసాన్’ కింద 37,021 మంది రైతులు లబ్ధి పొందనుండగా, మొత్తం రూ.30.04 కోట్లు విడుదల కానున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో 34,223 మంది, 28,633 మంది రైతులకు కలిపి రూ.22.83 కోట్లు, సర్వేపల్లి నియోజకవర్గంలో 27,958 మంది, 22,610 మంది రైతులకు రూ.18.50 కోట్లు మంజూరు కానున్నాయి.

కావలి నియోజకవర్గంలో 18,305 మంది, 13,632 మంది రైతులకు రూ.11.87 కోట్లు, కోవూరు నియోజకవర్గంలో 16,938 మంది, 12,161 మంది రైతులకు రూ.10.90 కోట్లు, వెంకటగిరి నియోజకవర్గంలో 16,015 మంది, 12,921 మంది రైతులకు రూ.10.59 కోట్లు విడుదల చేయనున్నారు. గూడూరు నియోజకవర్గంలో 13,532 మంది, 10,832 మంది రైతులకు రూ.8.93 కోట్లు, నెల్లూరు నియోజకవర్గంలో 5,299 మంది, 4,111 మంది రైతులకు రూ.3.47 కోట్లు జమ కానున్నాయి.

మొత్తం జిల్లావ్యాప్తంగా తొలి విడతలోనే ఏకంగా రూ.117.16 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల స్పష్టం చేశారు.

అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా నిధులు చేరేందుకు రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. రైతులు తమ భూమి వివరాలు (Webland Data), కుటుంబ డిజిటల్ సర్వే వివరాలు, యాక్టివ్ బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకుని ఉండాలని, e-KYC పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అప్పుడే నగదు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతుందని ఆయన వివరించారు.

ఈ నిధుల విడుదలను పురస్కరించుకుని రేపు జిల్లావ్యాప్తంగా “పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్” పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనేలా రైతు వేదికల ద్వారా సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట గ్రామంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. అక్కడి నుంచే సీఎం రాష్ట్రవ్యాప్తంగా నిధుల విడుదలకు బటన్ నొక్కనున్నారు.

జాతీయ స్థాయిలో పీఎం-కిసాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుండి డిజిటల్ విధానంలో ప్రారంభించనున్నారు.

ఈ రైతు సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి నెల్లూరు జిల్లాలోని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు.