రాయలసీమ న్యూస్, తిరుపతి: సూళ్ళూరుపేట, జూలై 14: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణాన్ని సుందరంగా, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికాబద్ధ నగరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సక్రమ పారవేయింపు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలపై దృష్టి సారిస్తూ మున్సిపాలిటీ ముందుకు సాగుతోంది.
ఈ నేపథ్యంలో ‘ సాలిడ్ వేస్ట్ మనగెమెంత్ -2026’ నిబంధనలను పట్టణంలో పక్కాగా అమలు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ కె. చిన్నయ్య తెలిపారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో ప్రజలకు పారిశుధ్యంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
స్థానిక మీడియా ప్రతినిధులతో కమిషనర్ సమావేశంలో పట్టణ అభివృద్ధి, పారిశుధ్య చర్యలపై వివరాలు వెల్లడించారు.
“మన సూళ్ళూరుపేట మున్సిపాలిటీ - మన బాధ్యత” అనే నినాదంతో పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని, ఇందుకు ప్రతి ఒక్కరూ పూర్తి సహకారం అందించాలని
అని కమిషనర్ కె. చిన్నయ్య ప్రజలను విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు అంటించడం సరికాదని, దీనివల్ల నగర సౌందర్యం దెబ్బతింటుందని కమిషనర్ హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ప్రమాదకరమని, ఇటువంటి చర్యలను నివారించాలని సూచించారు.
పట్టణ పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ తెలిపారు. డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి కారణంగా వర్షాకాలంలో నీరు రోడ్లపైకి వచ్చి ఓవర్ ఫ్లో అవుతూ ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆయన వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పర్యవేక్షణలో డ్రైనేజీ కాలువల డీషీల్టేషన్ పనులను క్షేత్రస్థాయిలో బాటమ్ లెవల్ వరకు అత్యంత వేగంగా చేపడుతున్నట్లు కమిషనర్ చెప్పారు.
ఇప్పటికే పట్టణంలోని కొన్ని కీలక ప్రాంతాల్లో Gulf పద్ధతులను అనుసరించి నీటి ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా శాశ్వత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రజలు తమ ఇళ్ల నుంచి వెలువడే చెత్తను రోడ్లపై వేయకుండా, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీకి అందించాలని కమిషనర్ కోరారు. మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న అనుమతులు, సర్టిఫికెట్లను మున్సిపల్ చట్టం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా రీన్యువల్ చేసుకోవాలని ఆయన సూచించారు.
మున్సిపల్ కార్యాలయం ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, పౌరులు తమ బాధ్యతను గుర్తించి సహకరిస్తేనే పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని కమిషనర్ తెలిపారు. ఏవైనా సమస్యలు ఉన్నా లేదా అభివృద్ధి పనులపై సందేహాలు ఉన్నా నేరుగా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆయన స్పష్టం చేశారు.













