తిరుపతి విమానాశ్రయం నుంచి నడిచే విమానాల రాకపోకల సమయాల్లో మార్పులు చేశారు. ఈ కొత్త షెడ్యూల్‌ను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఇండిగో, స్టార్ఎయిర్, ఎయిర్ ఇండియా నిర్వహించే విమానాలకు సంబంధించి కొత్త సమయాలు నిర్ణయించారు.

తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ఇండిగో విమానాల సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 7:20 గంటలకు ఇండిగో (6ఇ6567), ఉదయం 11:15 గంటలకు ఇండిగో (6ఇ7503), మధ్యాహ్నం 1:50 గంటలకు ఇండిగో (6ఇ6296) విమానాలు నడవనున్నాయి. సాయంత్రం 5:10 గంటలకు ఎయిర్ ఇండియా (ఐఎక్స్1829), రాత్రి 8:20 గంటలకు ఇండిగో (6ఇ6565) విమానాలు హైదరాబాద్‌ రూట్‌లో సేవలు అందించనున్నాయి.

కర్ణాటకలోని శివమొగ్గకు తిరుపతి నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు స్టార్ ఎయిర్ (ఎస్5202) విమానం నడవనుంది. అలాగే విశాఖపట్నానికి మధ్యాహ్నం 3:30 గంటలకు ఇండిగో (6ఇ7063) విమానం సేవలు అందించనుంది. ఢిల్లీకి తిరుపతి నుంచి సాయంత్రం 6:25 గంటలకు ఇండిగో (6ఇ2378) విమానం బయలుదేరేలా షెడ్యూల్‌ రూపొందించారు.

కొత్త సమయాల ప్రకారం ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రయాణికులు తాజా షెడ్యూల్‌ను తప్పనిసరిగా గమనించాలని ఎయిర్ లైన్స్ అధికారులు సూచించారు. విమాన టికెట్లు బుక్ చేసుకునే ముందు సమయాలను మరోసారి పరిశీలించి, అవసరమైన మార్పులు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.