మెగా సామ్రాజ్యంలో రికార్డుల వేట భారతీయ చలనచిత్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు ఏ తండ్రీకొడుకుల జంటకూ సాధ్యం కాని రీతిలో, ఒకే క్యాలెండర్ ఇయర్‌లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ విడివిడిగా ₹300 కోట్ల క్లబ్‌లో చేరి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో ఈ తండ్రీకొడుకులు గ్లోబల్ స్థాయిలో భారీ గ్రాస్ వసూళ్లను రాబడుతున్నారు.

కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, తన స్టైల్ మాస్ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరి పోశారు. థియేటర్లలో విజువల్ ఫీస్ట్‌గా నిలిచిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్లకు పైగా గ్లోబల్ గ్రాస్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను కుదిపేసింది. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని నిరూపించిన ఈ కలెక్షన్లు, మెగాస్టార్ స్టామినా ఏ స్థాయిలో ఉందో ట్రేడ్ వర్గాలకు మరోసారి స్పష్టంగా చూపించాయి.

ఒకవైపు తండ్రి ఇలా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తుంటే, మరోవైపు కొడుకు రామ్ చరణ్ అంతకంటే వేగంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రస్తుతం బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. ఈ చిత్రం విడుదలైన కేవలం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా నమ్మశక్యం కాని రీతిలో ₹393 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూలు చేసి సరికొత్త సంచలనం సృష్టించింది. చరణ్ కెరీర్‌లో ఇదొక ల్యాండ్‌మార్క్ కలెక్షన్ల వేటగా నిలిచింది.

తెలుగు సినిమా చరిత్రలో ఒకే సంవత్సరంలో తండ్రీకొడుకులు ఇద్దరూ విడివిడిగా ₹300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇటు చిరంజీవి, అటు రామ్ చరణ్ ఒకేసారి తమ సినిమాలతో భారీ బ్లాక్‌బస్టర్లను అందుకోవడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

సోషల్ మీడియాలో ఈ సరికొత్త అధ్యాయం పై మెగా అభిమానులు విపరీతమైన హంగామా చేస్తున్నారు. తండ్రీకొడుకుల ఈ అరుదైన రికార్డును హైలైట్ చేస్తూ, కలెక్షన్ల పోస్టర్లు, రికార్డు గ్రాఫిక్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్‌లో సంబరాలు జరుపుకుంటున్నారు. ఇండియన్ సినీ హిస్టరీలో చిరంజీవి–రామ్ చరణ్‌లు కలిసి సృష్టించిన ఈ రికార్డు, భవిష్యత్తులో మరెన్ని సంవత్సరాలు గుర్తుండిపోయే ఘట్టంగా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.