ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజులు వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఉత్తర బంగాళాఖాతంలోని ఉపరితల ద్రోణి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, దక్షిణ రాజస్థాన్, గుజరాత్‌ల మీదుగా ఈశాన్య అరేబియా సముద్రం వరకు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో కూడా మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములతో కూడిన మెరుపులు కొన్ని ప్రాంతాల్లో సంభవించే అవకాశం ఉందని తెలిపింది. గురువారం రోజున వర్షాలతో పాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.

రాయలసీమలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం, బుధవారం వర్షాలతో పాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో, గురువారం గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

వర్షాల సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వర్షాలు, ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని హెచ్చరించింది. రైతులు పోలాలకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు విరిగిపడినట్లు గమనించిన వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.