రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం- కిసాన్ (PM Kisan) నిధులు విడుదలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేశారు. 23వ విడత కింద ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు చొప్పున జమ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది. కేంద్రప్రభుత్వం 2019లో పీఎం-కిసాన్‌ పథకాన్ని ప్రారంభించింది. ఏటా మూడు దఫాలుగా రూ.2 వేలు చొప్పున మొత్తంగా రూ.6వేలను రైతుల ఖాతాల్లో వేస్తున్నారు (PM Kisan Installment).

మీ పేరుందా..?

పీఎం కిసాన్‌ నిధులు పొందే వారి జాబితాలో మీ పేరుందో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లిఅందులో ‘ఫార్మర్‌ కార్నర్‌’ సెక్షన్‌లోకి వెళ్లాలి. అందులో లబ్ధిదారుల లిస్ట్‌పై క్లిక్‌ చేస్తే రాష్ట్రం, జిల్లా, బ్లాక్‌, గ్రామం ఎంచుకుంటే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇ-కేవైసీ చేయని వారికి నిధులు జమ కావు. కాబట్టి అదే పోర్టల్‌లో ఇ-కేవైసీ ఆప్షన్‌ ఎంచుకుని ఆధార్‌ నంబర్‌, ఓటీపీ ద్వారా వెరిఫికేషన్‌ పూర్తి చేయొచ్చు.