కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించి, కేవలం పబ్లిసిటీ కోసమే పాకులాడుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో NEET పరీక్షల లీకేజీ వ్యవహారంలో మంత్రి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేసిన బొత్స, రాష్ట్రంలో DSC నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనివల్ల సుమారు మూడు లక్షల మంది నిరుద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. DSC అక్రమాలపై తక్షణమే CBIతో విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత మంత్రి తన పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

గతంలో స్పోర్ట్స్ quota కింద అర్హత ఉన్నవారికి నేరుగా ఉద్యోగాలు లభించేవని, కానీ ప్రస్తుత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత GOs‌ను సవరించి తమకు నచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టుకుందని బొత్స విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఆరోపణలపై విచారణ జరిపించి క్లీన్ చిట్ తో బయటకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని బొత్స మండిపడ్డారు. రూ.10,000 కోట్ల ఫి రేయింబర్సుమెంట్ , వసతి దీవెన బకాయిలు నిలిచిపోయాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కొట్టేసేందుకు ప్రభుత్వం అట్టహాసంగా ఊరేగింపులు చేస్తోందని బొత్స ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. గత TDP ప్రభుత్వ హయాంలో 15 వేల ఎకరాలు కావాలని చెప్పి కనీసం భూసేకరణ కూడా పూర్తి చేయలేకపోయారని గుర్తుచేశారు. తమ YSRCP ప్రభుత్వంలోనే అన్ని రకాల క్లియర్అన్సెస్ తీసుకువచ్చి పనులను వేగవంతం చేశామని ఆయన తెలిపారు.

విజయనగరంలో YSRCP పార్టీ కార్యాలయంపై పదేపదే మాట్లాడడం సరికాదని బొత్స హితవు పలికారు. రాజభరణాలు పోయినా ఇంకా రాచరిక మనస్తత్వంతో మాట్లాడటం తగదని వ్యాఖ్యానించారు. మెన్సస్ ట్రస్ట్ లో అవకతవకలు ఉన్నాయని, దానిని ప్రభుత్వంలో కలపాలని గతంలో ఆనంద్ గజపతి రాజు లేఖ రాసిన విషయాన్ని అశోక్ గజపతి రాజు కాదనగలరా అని ఆయన ప్రశ్నించారు.

ఈ అంశాలపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, కూటమి నేతలు చర్చకు రాగలరా అని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు.