ఏపీకి చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌కు సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (క్యాట్‌)లో చుక్కెదురైంది. తనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్‌ కొట్టివేసింది. 

తీవ్ర అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్‌లో ఉన్న సునీల్‌కుమార్‌ నేడు సర్వీస్‌ నుంచి రిలీవ్‌ అయ్యేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజైనా తనకు రిలీఫ్‌ ఇవ్వాలని సునీల్‌ కుమార్‌ క్యాట్‌ను కోరారు. మంగళవారం ఉదయం జరిగిన విచారణలో సునీల్‌ వాదనలు విన్న క్యాట్‌.. సస్పెన్షన్‌ రద్దు చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.

సునీల్‌ కుమార్‌పై పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణ, నేర విచారణలకు ఎలాంటి మినహాయింపులు లేవని, అవి కొనసాగుతాయని మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయనకు లభించాల్సిన పెన్షన్‌ ప్రయోజనాలు అఖిల భారత సర్వీసుల నియమాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలకు లోబడి ఉంటాయని పేర్కొంది.