రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్
అమరావతి : జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ పత్రాలను కూటమికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. నామినేషన్ దాఖలు సందర్భంగా కూటమి ఎమ్మెల్యేల బృందం రమేశ్‌కు అండగా నిలిచింది.
లింగమనేని రమేశ్ నామినేషన్‌పై మొత్తం 10 మంది కూటమి ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. వీరిలో ఆరుగురు జనసేన ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. కూటమి తరఫున రాజ్యసభ స్థానానికి రమేశ్ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది.
నామినేషన్ దాఖలు సమయంలో కూటమి ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్ నాయకర్, వంశీకృష్ణ శ్రీనివాస్, దేవ వరప్రసాద్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కాగిత కృష్ణ ప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, ఎన్. ఈశ్వర రావు (BJP) లింగమనేని రమేశ్‌కు మద్దతుగా హాజరయ్యారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం రమేశ్, తమకు అండగా నిలిచిన ఈ ఎమ్మెల్యేలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
పవన్ కు ధన్యవాదాలు..
జనసేన అభ్యర్థిగా రాజ్యసభకు నామినేషన్ వేసిన విషయాన్ని లింగమనేని రమేశ్ వెల్లడించారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఉపముఖ్యమంత్రి పవన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అందరితో మరోసారి సమావేశమై మాట్లాడే అవకాశం ఉంటుందని రమేశ్ పేర్కొన్నారు. అనంతరం పవన్ తో లింగంనేని రమేష్ ప్రతేకంగా సమావేశమయ్యారు.







