రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
మైనార్టీ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన వైసీపీ: మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్
అమరావతి : గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పిల్లలు డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందుతుండటమే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అసహనంగా మారిందని ఆయన ఆరోపించారు. రాజధాని అమరావతిలో సోమవారం విలేకరులతో మాట్లాడిన మంత్రి ఫరూక్, వైఎస్ జగన్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో హజ్ భవన్ నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ, దాన్ని పూర్తి చేయకుండా ఐదేళ్ల పాటు నిర్లక్ష్యంగా వదిలేశారని ఆయన విమర్శించారు. మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఈ దిశగా భారీగా నిధులు కేటాయిస్తున్నామని వివరించారు.
కూటమి ప్రభుత్వంలో మైనార్టీల కోసం రూ.5 వేల కోట్లు కేటాయించామని మంత్రి గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. మైనార్టీ విద్యార్థుల చదువుకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పడుతోందని, ఇందుకోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు.
డీఎస్సీ నియామకాలపై వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి ఫరూక్ తీవ్రంగా ఖండించారు. గత తొమ్మిది నెలలుగా నిశ్శబ్దంగా ఉన్న వైసీపీ అధినేత ఇప్పుడు డీఎస్సీపై విష ప్రచారం ప్రారంభించారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అశాంతి వాతావరణం సృష్టించేందుకు వైఎస్ జగన్ కుట్రలు పన్నుతున్నారని మంత్రి విమర్శించారు.
నంద్యాలలో వైఎస్సార్ విగ్రహ ధ్వంసం ఘటనను ప్రస్తావించిన మంత్రి, ఆ ఘటన వెనుక వైసీపీ కార్యకర్తలే ఉన్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ కాలంలో ఇచ్చిన హామీలలో 85 శాతం మేరకు వైఎస్ జగన్ విఫలమయ్యారని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఫరూక్ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో 90 శాతం అమలు చేశామని మంత్రి తెలిపారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంపై ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని, త్వరలోనే హైకోర్టు బెంచ్‌ను కర్నూలుకు తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.ఆస్తుల విషయంలో కుటుంబంలోనే కలహాలు రేపుతున్నారంటూ వైఎస్ జగన్‌పై మంత్రి ఫరూక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తల్లి, చెల్లితో వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని, పరిస్థితి ఎలా మలుపు తిరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అభిప్రాయపడ్డారు.







