రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రూపురేఖలు, ఆరోగ్యంపై అవమానకర వ్యాఖ్యలు, నిరంతర వేధింపులు చివరికి ఓ యువ వివాహిత ప్రాణాలను బలితీసుకున్నాయి. మండల పరిధి ఐత్రంపేట గ్రామానికి చెందిన సిద్దు అనూష (24) ఆత్మహత్యకు ఈ వేధింపులే కారణమని బద్వేలు గ్రామీణ సీఐ కృష్ణయ్య, బి.కోడూరు ఎస్సై సూర్యనారాయణరెడ్డి సోమవారం వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఐత్రంపేటకు చెందిన అనూషకు ఒంటిమిట్టకు చెందిన తేలూరు సాయినాథ్‌రెడ్డితో గత సంవత్సరం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అనూష తల్లిదండ్రులు అల్లుడికి కట్నం, కానుకలు ఇచ్చారు. వివాహానంతరం మొదటి మూడు నెలలు దంపతుల కాపురం సజావుగా సాగింది. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారాయి.
అనూషను భర్త తేలూరు సాయినాథ్‌రెడ్డి శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె అందంగా లేడని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నదని అంటూ భర్తతో పాటు అత్త, మామ, కొందరు బంధువులు పలుమార్లు అవమానకరంగా ప్రవర్తించినట్లు దర్యాప్తులో బయటపడిందని పేర్కొన్నారు. సూటిపోటు మాటలు, నిరంతర హింస కారణంగా అనూష తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో అనూష ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై తీవ్ర ఆవేదనకు గురైన అనూష తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బి.కోడూరు పోలీసులు మొత్తం అయిదుగురిపై కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల వేధింపులే తన కుమార్తె ప్రాణాలను తీసుకున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
కేసులో ప్రధాన నిందితులుగా గుర్తించిన అనూష భర్త తేలూరు సాయినాథ్‌రెడ్డి, మామ తేలూరు వెంకట శేషారెడ్డిలను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఇద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి రిమాండ్‌కు పంపినట్లు సీఐ కృష్ణయ్య, ఎస్సై సూర్యనారాయణరెడ్డి వివరించారు.
ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. అనూష ఆత్మహత్య కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని, అందుబాటులోకి వచ్చే ఆధారాలన్నింటినీ పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.













