రాయలసీమ న్యూస్, మదనపల్లె: చౌడేపల్లి: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలోని ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. 13-07-2026 సోమవారం జరిగిన హుండీ లెక్కింపులో 54 రోజుల వ్యవధికి గాను దేవస్థానానికి గణనీయమైన మొత్తంలో నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీ రూపంలో ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ, ఉప కమిషనర్ ఏకాంబరం వివరాలు వెల్లడించారు.
దేవస్థాన హుండీ నుండి నగదు రూపంలో మొత్తం రూ. 1,25,45,420.00 లు లెక్కించబడినట్లు తెలిపారు. అదనంగా భక్తులు సమర్పించిన బంగారం మొత్తం 000-043-950 గ్రాములు, వెండి 000-550-100 గ్రాములు గా నమోదైంది. హుండీలో విదేశీ కరెన్సీ కూడా లభించింది.
విదేశీ కరెన్సీ వివరాలను వెల్లడిస్తూ అధికారులు, యురొ 10 విలువైన 1 నోట్, యురొ 5 విలువైన 1 నోట్, సెంట్రల్ బ్యాంకు అఫ్ కువైట్ (1 Dinar) విలువైన 1 నోట్, థాయిలాండ్ 20 విలువైన 1 నోట్, సెంట్రల్ బ్యాంకు అఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో (20 Dollars) విలువైన 1 నోట్, సెంట్రల్ బ్యాంకు అఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో (1 Dollars) విలువైన 1 నోట్ హుండీలో లభించినట్లు పేర్కొన్నారు.
దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం వద్ద ఏర్పాటు చేసిన హుండీ ద్వారా రూ. 22,179/- ఆదాయం వచ్చినట్లు, అలాగే శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థాన హుండీ ద్వారా రూ. 96,241.00 ఆదాయం సమకూరినట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు.
హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా దేవాదాయ అధికారి శ్రీ J. విశ్వనాధ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి పోలీస్ సిబ్బంది, ఇండియన్ బ్యాంక్ పుంగనూరు శాఖ ప్రతినిధులు, దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల విశ్వాసం, విరాళాల వల్ల దేవస్థాన ఆదాయం రికార్డు స్థాయికి చేరినట్లు అధికారులు పేర్కొన్నారు.













