ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 18న మదనపల్లె పర్యటనకు విచ్చేయనున్నట్లు అధికార వర్గాలకు సమాచారం అందింది. జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్‌ హబ్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు రాష్ట్రంలో ఆదర్శ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ‘జలధార’ పనులను ఆయన పరిశీలించనున్నారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌కు శనివారం సంకేతాలు అందినట్లు తెలిసింది. గతంలో కూడా సీఎం మదనపల్లె పర్యటన ఖరారైనప్పటికీ చివరి నిమిషంలో అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజా పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం మళ్లీ సన్నద్ధమవుతోంది.

మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్‌ హార్టికల్చర్‌ హబ్‌ రాష్ట్ర ఉద్యాన రంగానికి కీలక మౌలిక వసతిగా నిలవనుందని అధికారులు భావిస్తున్నారు. రైతులకు నాణ్యమైన సేవలు అందించేందుకు, పంటల నిల్వ, ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఎగుమతుల ప్రోత్సాహం వంటి అంశాలకు ఈ హబ్‌ దోహదపడనుందని సంబంధిత శాఖ అంచనా వేస్తోంది.

రాష్ట్రంలో నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా అమలు చేస్తున్న ‘జలధార’ ప్రాజెక్టు పనులను కూడా ఈ పర్యటనలో సీఎం ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ప్రాజెక్టు అమలులో పురోగతి, భూగర్భ జలాల స్థాయిల్లో మార్పులు, చెరువుల పునరుద్ధరణ పనుల స్థితిగతులపై ఆయన అధికారుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు.

జలధార పనుల పరిశీలన అనంతరం భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ చర్యల అమలుపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఈ పర్యటన ద్వారా జిల్లాలో సాగు నీటి లభ్యత, రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి వినియోగం, సంరక్షణపై ప్రభుత్వం మరింత దృష్టి సారించే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

సీఎం పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ ఒకట్రెండ్రోజుల్లో విడుదల కానుంది. పర్యటన సంకేతాలు అందిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం ప్రాథమిక ఏర్పాట్లను ప్రారంభించింది. రూట్‌మ్యాప్‌ సిద్ధం చేయడం, భద్రతా ఏర్పాట్లు, సభా ప్రాంగణం ఎంపిక, హార్టికల్చర్‌ హబ్‌ శంకుస్థాపన కార్యక్రమం, జలధార పనుల పరిశీలనకు సంబంధించిన లాజిస్టిక్స్‌పై సంబంధిత శాఖలు కసరత్తు మొదలుపెట్టాయి.

మదనపల్లె పర్యటన సందర్భంగా సీఎం పాల్గొనే కార్యక్రమాల వివరాలు, సమయాలపై స్పష్టత వచ్చేలా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో వివిధ విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. జిల్లాలో ఉద్యాన, నీటి వనరుల రంగాల అభివృద్ధికి ఈ పర్యటన మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.