రాయలసీమ న్యూస్, అన్నమయ్య: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల అక్రమ విక్రయాలపై పోలీసులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీ మొత్తంలో గుట్కా, కూల్ లిప్స్, చ్యూయింగ్ టొబాకో తదితర పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో మొత్తం 26,760 ప్యాకెట్ల నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టుబడగా, వాటి విలువను పోలీసులు సుమారు రూ.32,11,384గా అంచనా వేశారు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో మదనపల్లె వన్‌టౌన్ సీఐ కె. రాజారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఆదివారం ఈ దాడులు చేపట్టింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా మదనపల్లె పట్టణంలోని ఇబ్రహీం ట్రేడర్స్‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా పిక్టోరియల్ హెల్త్ వార్నింగ్ లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విక్రయానికి ఉంచిన గుట్కా, కూల్ లిప్స్, చ్యూయింగ్ టొబాకో, వైట్ లాండీ తదితర నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ స్టాక్‌ను స్వాధీనం చేసి గోదామును సీజ్ చేశారు.
ఈ కేసులో కాలగడ్డ నబీహాన్ అలియాస్ ఇబ్రహీం (48) ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం–2003 (COTPA)లోని సంబంధిత సెక్షన్లు, అలాగే BNS సెక్షన్ 318(4) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలో ఇలాంటి మరిన్ని కేంద్రాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గుట్కా, కూల్ లిప్స్, ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తులను నిల్వ చేసి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ వ్యాపారాలపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, సమాచారం అందించి సహకరించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు పేర్కొన్నారు.













