రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రాజంపేట: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతల ఆదేశాల మేరకు రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాజంపేట పార్లమెంట్ జనసేన సమన్వయకర్త అతికారి కృష్ణ తెలిపారు.
శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీల మధ్య అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు, అభిప్రాయ భేదాల కారణంగా అభ్యర్థులు పోటీలో ఉన్న సందర్భాల్లో పెద్ద మనసుతో పరస్పరం సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. పొత్తు ధర్మానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.
పోటీలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ప్రధానంగా రాజంపేట మున్సిపాలిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను ప్రజలు గమనించారని అతికారి కృష్ణ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాలన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యానికి అనుగుణంగా తామంతా పనిచేస్తున్నామని ఆయన వివరించారు.
కూటమి అభ్యర్థుల విషయంలో సమన్వయం, ఐక్యతతో ముందుకు సాగుతామని అతికారి కృష్ణ తెలిపారు. నవంబర్ ఒకటో తేదీన జరిగే పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు స్వచ్ఛందంగా పాల్గొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు గురువిగారి వాసు, కొరముట్ల హరి తదితరులు పాల్గొన్నారు.













