రాయలసీమ న్యూస్, అన్నమయ్య: అన్నమయ్య జిల్లా మదనపల్లె: మురసు తుపాను ప్రభావంతో అతి వేగంగా పెనుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ హెచ్చరించారు. భారీ వర్షాలు, బలమైన గాలుల దృష్ట్యా ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని సూచించారు.
అత్యవసర పరిస్థితులు తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఎస్పీ సూచించారు. అవసరం లేని ప్రయాణాలు, బయట తిరుగుడు పూర్తిగా మానుకోవాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు రావడం ప్రమాదకరమని హెచ్చరించారు.
చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని, వర్షం, గాలుల సమయంలో అలాంటి ప్రదేశాల నుంచి దూరంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. తెగిపడిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదని, వాటి గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
రహదారులపై పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే సాహసం ఎవరూ చేయరాదని ఎస్పీ స్పష్టం చేశారు. నీటి ప్రవాహం ఎంత ఉందో అంచనా వేయలేని పరిస్థితుల్లో వాహనాలతో గాని, నడిచిగాని వాటిని దాటేందుకు ప్రయత్నించడం ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు.
నీరు చేరిన రోడ్లపై వాహనాల రాకపోకలను వెంటనే నిలిపివేయాలని సంబంధిత ప్రాంతాల్లోని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్హెచ్ఓలు మండల అధికారులతో సమన్వయం పెంచాలని ఎస్పీ తెలిపారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా నిరంతర సమాచార మార్పిడి జరిపి, పరిస్థితులను నిశితంగా గమనించాలని సూచించారు.
క్షేత్రస్థాయి నివేదికలను ఎప్పటికప్పుడు జిల్లా కంట్రోల్ రూమ్‌కు పంపాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో తుపాను, వర్షాల ప్రభావం, నష్టం, అవసరమైన సహాయంపై సమగ్ర సమాచారం సేకరించి వెంటనే తెలియజేయాలని సూచించారు.
అత్యవసర సహాయం కోసం ప్రజలు వెంటనే డయల్ 112 సేవను సంప్రదించాలని ఎస్పీ కోరారు. ప్రమాదాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, నీటిమునిగిన ప్రాంతాలు, ఇతర అత్యవసర పరిస్థితుల గురించి వెంటనే సమాచారం ఇస్తే తక్షణ చర్యలు తీసుకోవడం సులభమవుతుందని తెలిపారు.













