మదనపల్లె పట్టణంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. దొంతివీధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. రెడ్డి సాహెబ్ అధ్యక్షత వహించారు. ఏపీసీసీ జనరల్ సెక్రటరీ షేక్ అల్లా బకష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె సేవలను స్మరించుకుంటూ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ రాజకీయ పరిస్థితులపై, ఇందిరాగాంధీ పాలనలో అమలైన కీలక నిర్ణయాలపై నాయకులు ప్రసంగించారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశ ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీ విధించగా, నేటి పరిస్థితుల్లో కొందరు నాయకులు పదవులు, అధికారం కోసం అప్రకటిత ఎమర్జెన్సీ విధిస్తూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఎస్. రెడ్డి సాహెబ్ విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలు ఆందోళనకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇందిరాగాంధీ దేశానికి ‘ఉక్కు మహిళ’గా నిలిచారని, తన సమర్థవంతమైన నాయకత్వంతో భారతదేశానికి ప్రపంచ వేదికపై ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని షేక్ అల్లా బకష్, ఎస్. రెడ్డి సాహెబ్ గుర్తుచేశారు. బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవం వంటి కీలక కార్యక్రమాల ద్వారా రైతులు, పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె కృషి చేశారని నాయకులు వివరించారు.

ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆమె చూపిన మార్గంలో నేటి నాయకత్వం నడవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం కోసం ఆమె అమలు చేసిన విధానాలు ఇప్పటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.

కార్యక్రమంలో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమృతేజ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శరత్ కుమార్ రెడ్డి, ఎన్ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్, మహమ్మద్ షరీఫ్, హైదర్ ఇల్లాహి, మీనా కుమారి, ముబారక్ ఖాన్, మహబూబ్ పీర్, ఈశ్వరయ్య, సోమశేఖర్, రవీంద్ర, ఈశ్వరమ్మ, కాసిం వల్లి, నాగరాజ, గంగులప్ప, వెంకటరమణ, అస్లాం భాష, సాదిక్ భాష, ఖాజావలి, హరి తదితరులు పాల్గొన్నారు.