రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రాయచోటి: న్యాయ విచారణ ప్రక్రియలో సాంకేతికతను వినియోగిస్తూ అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ రూపొందించిన ‘కోర్టు మానిటరింగ్ సిస్టమ్’ (CMS) యాప్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ది ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎక్ష్ప్రెస్స్ కంప్యూటర్ నిర్వహించిన "టెక్నాలజీ సభ ఎక్స్లెన్స్ అవార్డ్స్ -2026" సదస్సులో ఈ యాప్‌కు అవార్డు ప్రకటించారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, IPS స్వయంగా జైపూర్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరై ఈ అవార్డును అందుకున్నారు. న్యాయ విచారణలో సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ రూపొందించిన ఈ CMS యాప్‌కు జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపు అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖకు అరుదైన గౌరవంగా నిలిచింది.
కోర్టు కేసులు, నిందితుల వివరాలు, కేసుల స్థితి, కోర్టు సమన్లు, వారెంట్ల అమలు, సాక్షుల హాజరు వంటి అంశాలను డిజిటలైజ్ చేయడం ద్వారా కేసుల విచారణ వేగవంతం కావడమే కాకుండా నేరస్థులకు సకాలంలో శిక్షలు పడేలా చేయడంలో CMS వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది.
సాధారణంగా పోలీసు శాఖకు క్షేత్రస్థాయి శాంతిభద్రతల నిర్వహణతో పాటు కోర్టు సమన్లు, వారెంట్ల అమలు, సాక్షుల హాజరు పర్యవేక్షణ వంటి పనులు భారీ భారంగా మారుతుంటాయి. ఈ మొత్తం ప్రక్రియను సులభతరం చేయాలనే ఆలోచనతో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రేరణగా CMS యాప్ రూపుదిద్దుకుంది. కోర్టు విధుల పర్యవేక్షణను డిజిటలైజ్ చేయడంతో పోలీస్ సిబ్బందిపై పనిభారం గణనీయంగా తగ్గినట్లు జిల్లా వర్గాలు చెబుతున్నాయి.
ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా సమన్లు, వారెంట్ల జారీ, అమలు ప్రక్రియను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు సూక్ష్మంగా పర్యవేక్షించే వీలు కలిగింది. సాక్షుల హాజరు క్రమబద్ధం కావడంతో కోర్టుల్లో విచారణలు వేగవంతం అవుతున్నాయి. దీని ఫలితంగా నేరస్థులకు చట్టపరమైన శిక్షలు ఆలస్యం కాకుండా పడటంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం అందే పరిస్థితి ఏర్పడుతోంది.
డిజిటల్ గవర్నెన్స్‌ను బలోపేతం చేయడం, ప్రజా సేవలను సులభతరం చేయడం, కేసుల విచారణలో విలువైన సమయం, మానవ వనరులను ఆదా చేయడంలో CMS యాప్ సాధించిన ఫలితాలను పరిగణనలోకి తీసుకుని జాతీయ స్థాయి జ్యూరీ ఈ ప్రాజెక్టును అవార్డుకు ఎంపిక చేసినట్లు సమాచారం.
జిల్లా ప్రజల రక్షణ, న్యాయ వ్యవస్థ బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తున్న జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది యొక్క సమిష్టి కృషికే ఈ జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది.
అని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, IPS పేర్కొన్నారు.
జాతీయ వేదికపై అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్ఠను ఎత్తిన ఈ గౌరవం నేపథ్యంలో మదనపల్లెలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో హర్షాతిరేకాలు నెలకొన్నాయి. జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి శుభాకాంక్షలు తెలియజేశారు.













