ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇప్పటికీ పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ అన్నారు. జూన్‌ 30 వరకు పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ విక్రయాలపై రూ.74,781 కోట్ల మేర నష్టం చవిచూసినట్లు వెల్లడించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ.. పాత క్రూడాయిల్‌నే ఇప్పటికీ ప్రాసెస్‌ చేస్తుండడం ఇందుకు కారణమన్నారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘పెట్రో ఉత్పత్తులను ప్రాసెస్‌ చేయడానికి రెండు నెలల ముందే ముడి చమురును ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు కొనుగోలు చేస్తాయి. రెండు నెలల ముందు నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. అంటే ఇప్పుడు ప్రాసెస్‌ చేస్తున్న ముడి చమురు ఏప్రిల్‌ లేదా మే నెలలో కొన్నది. అప్పట్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు చాలా అధికంగా ఉన్నాయి. అమెరికా- ఇరాన్‌ మధ్య ఒప్పందం కుదిరాక ముడిచమురు ధరలు దిగొచ్చాయి’’ అని హర్దీప్‌ సింగ్‌ పురి వివరించారు. దేశీయంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు (Petrol- diesel prices) ఎప్పుడు తగ్గిస్తారు? అని విలేకరులు ప్రశ్నించగా.. రాబోయే కొన్ని వారాల పాటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు అది సమంజసమైన ప్రశ్న అవుతుందంటూ పురీ పేర్కొన్నారు.