చిత్తూర్:- ఆంధ్రప్రదేశ్‌లో అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా అటవీశాఖ మరో కీలక అడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో డ్రోన్ సాంకేతికతను వినియోగించి సీడ్ బాల్స్ జారవిడిచే కార్యక్రమం చేపట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో ప్రారంభమైన సీడ్ బాల్స్ తయారీ, పంపిణీ కార్యక్రమం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రారంభంలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యంగా నిర్ణయించగా, ప్రజల భాగస్వామ్యంతో అటవీశాఖ ఇప్పటికే 3.80 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేసింది. వీటిలో సుమారు 90 లక్షల సీడ్ బాల్స్‌ను మానవ వనరుల సహాయంతో వివిధ అటవీ ప్రాంతాల్లో ఇప్పటికే వెదజల్లారు.

చింతూరు అటవీ రేంజ్ పరిధిలో మొత్తం 5 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయగా, అందులో 2.71 లక్షల సీడ్ బాల్స్‌ను అటవీశాఖ సిబ్బంది సహాయంతో ఇప్పటికే పంపిణీ చేశారు. మిగిలిన సీడ్ బాల్స్‌ను మనుషులు చేరుకోలేని దట్టమైన అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో జారవిడుస్తున్నారు. ఈ చర్యల ద్వారా క్షీణించిన అటవీ ప్రాంతాల్లో తిరిగి వృక్ష సంపదను పెంపొందించడం లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు.

చింతూరు పరిధిలో 440.50 హెక్టార్ల మేర క్షీణించిన అటవీ భూమిని గుర్తించి పునరుద్ధరణ కార్యక్రమాన్ని అటవీశాఖ ప్రారంభించింది. లక్కవరం రిజర్వ్ ఫారెస్ట్‌లో మొదలైన ఈ డ్రోన్ ఆధారిత సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని వర్షాకాల పరిస్థితులను బట్టి కంసులూరు, మర్రిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకులకు కూడా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అవకాశం ఉన్న ప్రాంతాల్లో మానవ వనరులను వినియోగించి సీడ్ బాల్స్ వెదజల్లగా, అందుబాటులో లేని దట్టమైన అడవుల్లో డ్రోన్ సాంకేతికతను ఉపయోగించనున్నారు. ఈ కార్యక్రమంలో వేప, చింత, నేరేడు, నోని, నల్లమద్ది, ఉసిరి, రేలా, తాని వంటి దేశీయ, పర్యావరణహిత వృక్ష జాతుల విత్తనాలతో తయారైన సీడ్ బాల్స్‌ను పంపిణీ చేస్తున్నారు.

రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించే దిశగా ఈ డ్రోన్ ఆధారిత సీడ్ బాల్స్ కార్యక్రమం కీలకంగా మారనుందని అటవీశాఖ భావిస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ అడవుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.