రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో పోలీసుల నిఘా ఉన్నా జూదం ఆటకు రెక్కలొస్తున్నాయి. వైకాపా హయాంలో విచ్చలవిడిగా సాగిన జూదానికి ఇప్పుడు కొందరి అండదండలు తోడవ్వడంతో ఆటాడిచ్చే వారు అదే ధైర్యంతో జూదరులకు భరోసా ఇస్తున్నారు. దాడులు, వాహనాలు, నగదు సీజ్ చేస్తారనే భయం వద్దని, తమ స్థావరాలకు వచ్చే వారికి పూర్తి భరోసా ఇస్తున్నట్లు నిర్వాహకులు చెప్పుకుంటున్నారు.
‘మీ వాహనాలు, మీ సొత్తుకు మేం పూచీ’ అంటూ కొందరు జూదరులను ఆకర్షిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ హామీలతో సుదూర ప్రాంతాల నుంచి కూడా జూదరులు వచ్చి ఆడుతుండగా, రోజూ లక్షల్లో నగదు చేతులు మారుతున్నట్లు సమాచారం. ఇవన్నీ పోలీసులకు తెలిసినా పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హంగా మారింది.
చిత్తూరు నగర శివారుతో పాటు గంగాధరనెల్లూరు, బంగారుపాళ్యం, యాదమరి సరిహద్దు ప్రాంతాలు, తవణంపల్లెతో పాటు మరికొన్ని మండలాల్లో జూద స్థావరాలు పెరుగుతున్నాయి. గతంలో వారంలో మూడు రోజులు, సెలవు రోజుల్లో మాత్రమే జూదం సాగుతుండగా, ఇప్పుడు దాదాపు ప్రతిరోజూ ఆటలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. చిన్న వ్యాపారులే కొందరి అండతో నిర్భయంగా స్థావరాలు ఏర్పాటు చేసి రోజువారీగా నిర్వహించడం ప్రత్యేకంగా కనిపిస్తోంది.
ఒకచోట ఆట సాగుతుంటే, వాహనాల పార్కింగ్‌ను మరో ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. స్థానికులకు అనుమానం రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. నగదు లావాదేవీలతో పాటు క్యాష్‌లెస్ విధానంలో కూడా జూదం జరుగుతుండటం గమనార్హం. భయంతో నగదు తీసుకురాని వారు అక్కడే ఉన్న నిర్వాహకులు, ఫైనాన్సియర్ల నుంచి రోజువారీ ఫైనాన్స్ తీసుకుని ఆడుతున్నారని సమాచారం. లాభపడుతున్న వారు కొందరే కాగా, నష్టపోతున్న వారు అధికమని బాధితులు చెబుతున్నారు.
జూదం ఆట జరుగుతోందని తెలిసినా పోలీసులు తెలియనట్లే వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆయా స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఆటలు జరుగుతున్నాయో కొందరు పోలీసులకు బాగా తెలిసిన విషయమేనని, వారి పరోక్ష సాయం కూడా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక విభాగాల్లోని కింది స్థాయి సిబ్బంది కొందరు నిర్వాహకులకు సహకరిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిఘా బలోపేతం చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.













