చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఓ హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఆలయ దర్శనం పేరుతో పన్నిన ఈ హత్యా కుట్ర సీసీటీవీ ఫుటేజీలతో వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

తమిళనాడుకు చెందిన రమేష్.. కుప్పం ప్రాంతానికి చెందిన హాసినిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. మంగళవారం దంపతులు తమ చిన్నారితో కలిసి మల్లప్పకొండ మల్లేశ్వరస్వామి ఆలయానికి బైక్‌పై వెళ్లారు. అయితే రాత్రి దాటినా ఇంటికి తిరిగి రాకపోవడంతో హాసిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆలయ పరిసరాలు, ఘాట్‌రోడ్డు మార్గంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. అందులో హాసిని తన భర్తతో కాకుండా ఇద్దరు యువకులతో కలిసి అదే బైక్‌పై వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ ఆధారాలతో గాలింపు ముమ్మరం చేయగా.. ఘాట్‌రోడ్డు సమీపంలోని అటవీ ప్రాంతంలో రమేష్ మృతదేహం లభించింది. శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

ప్రాథమిక విచారణలో హాసిని తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితురాలితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం, ఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది.