టీజీ20 లీగ్‌లో హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ జట్టు విజేతల బాట పట్టింది. ఆరంభ మ్యాచ్‌లోనే పాలమూరు స్ట్రైకర్స్‌పై ఏకపక్ష విజయం సాధించి తమ శక్తిని చాటింది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఈ ఛాంపియన్స్‌.. అనంతరం బ్యాటర్ల ధాటితో లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. ఈ విజయంతో పాలమూరు వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది.

హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ముందురోజు వర్షం కారణంగా కొద్దిగా మందకొడిగా మారిన పిచ్‌ను ఆ జట్టు బౌలర్లు చాకచక్యంగా ఉపయోగించుకున్నారు. పేసర్‌ అజయ్‌ దేవ్‌ గౌడ్‌, స్పిన్నర్లు యశ్వీర్‌ గౌడ్‌, ప్రణవ్‌ వర్మలు పాలమూరు బ్యాటర్లను బిగించి పట్టేశారు. ఫలితంగా పాలమూరు స్ట్రైకర్స్‌ 19.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది.

పాలమూరు తరఫున రోహిత్‌ రాయుడు (35; 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విఘ్నేశ్‌ రెడ్డి (30; 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), ప్రతీక్‌ పవార్‌ (30; 22 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లు) మాత్రమే ప్రతిఘటించారు. ఓపెనర్‌ చైతన్య (5) విఫలమయ్యాడు. గత మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసిన విఘ్నేశ్‌ ఈసారి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 9వ ఓవర్లో గణేశ్‌ గడుగు పట్టిన అద్భుత క్యాచ్‌తో కెప్టెన్‌ ప్రజ్ఞయ్‌ (9) ఔటయ్యాడు. రోహిత్‌ రాయుడు, అఫ్రిది (2) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరడంతో పాలమూరు ఒత్తిడిలో పడింది. చివరి 18 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయిన స్ట్రైకర్స్‌ 141 పరుగులకే కుప్పకూలింది.

హైదరాబాద్‌ బౌలర్లలో అజయ్‌ దేవ్‌ గౌడ్‌ 4 వికెట్లు (4/21) పడగొట్టి పాలమూరుకు గట్టి దెబ్బతీశాడు. యశ్వీర్‌ గౌడ్‌ 2/15, ప్రణవ్‌ వర్మ 2/25తో మెరిశారు. బౌలర్లు సమిష్టిగా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాలమూరు బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశమే లేకుండా పోయింది.

142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ ఛేదన ఆరంభంలో కొంత తడబడింది. రెండో ఓవర్లోనే ఓపెనర్‌ సాయివికాస్‌ (1) వికెట్‌ కోల్పోయింది. అయితే మూడో ఓవర్లో కెప్టెన్‌ అభిరథ్‌ రెడ్డి (35; 13 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి 24 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్లో అతడూ ఔటయ్యాడు. బౌలింగ్‌లో రాణించిన యశ్వీర్‌ గౌడ్‌ (3) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఈ ఛాంపియన్స్‌ 55/3తో నిలిచింది.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన అన్విత్‌ రెడ్డి, గణేశ్‌ గడుగు జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. లక్ష్యం పెద్దది కాకపోవడంతో ఇద్దరూ ఆతురపడకుండా స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ, అవకాశాలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాదారు. మొదట నెమ్మదిగా ఆడిన గణేశ్‌ తర్వాత ఆగ్రహంగా రాణించాడు. 11వ ఓవర్లో అన్విత్‌ రెండు ఫోర్లు, గణేశ్‌ ఒక ఫోర్‌, ఒక సిక్స్‌ బాది 21 పరుగులు రాబట్టడంతో మ్యాచ్‌ పూర్తిగా హైదరాబాద్‌ వైపు ఒరిగిపోయింది.

అన్విత్‌ రెడ్డి (53 నాటౌట్‌; 42 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), గణేశ్‌ గడుగు (50 నాటౌట్‌; 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. 15.4 ఓవర్లలోనే 147/3 స్కోరుతో లక్ష్యాన్ని ఛేదించిన ఈ ఛాంపియన్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సిక్స్‌తో జట్టుకు విజయాన్ని అందించడమే కాక తన అర్ధసెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు అన్విత్‌. ఈ ప్రదర్శనకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నాడు.

కెప్టెన్‌ అభిరథ్‌ రెడ్డి మెరుపు షాట్లకు ‘సూపర్‌ స్ట్రైకర్‌’ అవార్డు అందుకున్నాడు. గణేశ్‌ గడుగు ‘ఇన్‌క్రెడిబుల్‌ మూమెంట్‌’, ‘గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులను గెలుచుకున్నాడు. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అజయ్‌ దేవ్‌ గౌడ్‌కు రామోజీ ఫిలింసిటీలో రెండు రోజులు విహరించేలా ప్రత్యేక బహుమతి ప్రకటించారు. మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడం లేదా సెంచరీ చేయడం ద్వారా మెరిసే ఈ ఛాంపియన్స్‌ ఆటగాళ్లందరికీ ఇదే అవకాశం కల్పించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ తొలి విజయాన్ని పురస్కరించుకుని డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ డైరెక్టర్‌ సాంబశివరావు, ఈటీవీ భారత్‌ డైరెక్టర్‌ బృహతి, ఈటీవీ డైరెక్టర్‌ సుజయ్‌ జట్టు సభ్యులను అభినందించారు.

సంక్షిప్త స్కోర్లు:
పాలమూరు స్ట్రైకర్స్‌: 141 ఆలౌట్‌ (రోహిత్‌ రాయుడు 35, విఘ్నేశ్‌ 30, ప్రతీక్‌ 30; అజయ్‌ 4/21, యశ్వీర్‌ 2/15, ప్రణవ్‌ 2/25).
హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌: 147/3 (అన్విత్‌ 53 నాటౌట్‌, గణేశ్‌ 50 నాటౌట్‌, అభిరథ్‌ 35; రిషబ్‌ బస్లాస్‌ 2/17, రవికిరణ్‌ 1/29).