2027 వన్డే ప్రపంచకప్‌తో ముగిసే భారత దిగ్గజాల అంతర్జాతీయ ప్రయాణమా?

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027తో భారత క్రికెట్‌లో ఒక సువర్ణయుగం ముగియబోతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నెదర్లాండ్స్ వేదికలుగా వచ్చే ఏడాది జరగనున్న ఈ మెగా టోర్నీ అనంతరం టీమిండియాకు సేవలందిస్తున్న నలుగురు అగ్రశ్రేణి సీనియర్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. 2023 ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన చేదు అనుభవానికి బదులు తీర్చుకుని, ఎలాగైనా కప్పు గెలిచి కెరీర్‌కు ఘన ముగింపు పలకాలని వీరి లక్ష్యం.

క్రికెట్‌లో ఐసీసీ మెగా టోర్నీలు ముగిసిన వెంటనే సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం కొత్తేమీ కాదు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. అంతకుముందు T20 వరల్డ్ కప్ విజయం అనంతరం భారత్ తరఫున రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ , రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు దూరమయ్యారు. ఇప్పుడు వన్డే ప్రపంచకప్ తర్వాత మాత్రం కేవలం ఒక ఫార్మాట్‌నే కాదు, అంతర్జాతీయ క్రికెట్‌కే స్వస్తి పలికే దిశగా ఈ సీనియర్లు అడుగులు వేయవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఓపెనర్‌గా, మాజీ కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ శర్మ కు వన్డే ప్రపంచకప్ గెలవడం ఇప్పటికీ నెరవేరని కలగానే మిగిలిపోయింది. తన నాయకత్వంలో 2023లో తృటిలో చేజారిన ట్రోఫీని ఈసారి ఎలాగైనా ముద్దాడాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వచ్చే ఏడాది నాటికి రోహిత్ వయసు 40 దాటుతుంది. ఇటీవలి కాలంలో ఫిట్‌నెస్ సమస్యలు కూడా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో, భారత్ గెలిచినా ఓడినా 2027 తర్వాత ఆయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుత తరం అత్యుత్తమ బ్యాటర్‌గా పేరొందిన విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ విషయంలో ఇప్పటికీ యువ ఆటగాళ్లకు సవాల్ విసురుతున్నాడు. ఒక దశలో ఫామ్‌పై విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, తన ప్రదర్శనతో విమర్శకులను నిశ్శబ్దం చేశాడు. అయితే 2027 ప్రపంచకప్ ముగిసే సమయానికి విరాట్ సాధించాల్సిన పెద్ద మైలురాళ్లు దాదాపు పూర్తవుతాయని భావిస్తున్నారు. భారత్ ట్రోఫీ గెలిస్తే ఘనంగా వీడ్కోలు పలికే అవకాశం ఉందని, ఫలితం అనుకూలంగా లేకపోయినా భవిష్యత్తు దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్ ఆలోచించవచ్చని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విషయానికొస్తే, ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్న ఆయన కెరీర్ చివరి దశకు చేరుకుందని విశ్లేషణ. వచ్చే ఏడాది నాటికి 38 ఏళ్లు నిండనున్న జడేజా కు వన్డే జట్టులో క్రమం తప్పకుండా అవకాశాలు లభించడం లేదు. టెస్టుల్లో కూడా ఆయనకు ప్రత్యామ్నాయాలను వెతికే పనిలో సెలెక్టర్లు ఉన్నారని సమాచారం. ఇటీవల అరంగేట్రం చేసిన మానవ సితార్ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించడంతో, 2027 ప్రపంచకప్ అనంతరం జడేజా రిటైర్మెంట్ ప్రకటించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గత వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసి సంచలనం సృష్టించిన వేగవంతమైన బౌలర్ మహమ్మద్ షమీ ప్రస్తుతం గాయాల బారిన పడి ఏ ఫార్మాట్‌లోనూ జట్టులో లేడు. 35 ఏళ్ల వయసులో ఉన్న షమీ స్థానంలో యువ పేసర్లను ముందుకు తెచ్చే దిశగా సెలెక్షన్ కమిటీ అడుగులు వేస్తోంది. షమీ మాత్రం వచ్చే ప్రపంచకప్‌లో ఆడాలని బలంగా ఆశిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆయనకు ఎంపిక దక్కుతుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అవకాశం లభించినా, అదే ఆయన సుదీర్ఘ అంతర్జాతీయ ప్రయాణానికి చివరి టోర్నీగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దాదాపు దశాబ్ద కాలంగా భారత క్రికెట్‌ను తమ ప్రతిభతో శాసించిన రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ , రవీంద్ర జడేజా , మహమ్మద్ షమీ ల వంటి దిగ్గజాలు ఒకేసారి రంగం వీడే సమయం దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో కలవరం నెలకొంది. అయితే ఇదే సమయంలో కొత్త తరం ఆటగాళ్లకు మార్గం సుగమం కానుందని, భారత క్రికెట్‌లో మరో కొత్త శకం ఆరంభమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.