భారత టీ20 క్రికెట్ జట్టులో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే దిశగా బోర్డు అఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయాలు, BCCI సెలెక్టర్ల దృక్పథం ఒక్కటిగా లేవన్న వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా నివేదికల ప్రకారం, టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను తదుపరి టీ20 కెప్టెన్‌గా నియమించాలని బలంగా కోరుతున్నట్లు ప్రెస్ ట్రస్ట్ అఫ్ ఇండియా (PTI) వెల్లడించింది. అయితే గంభీర్ ప్రతిపాదనను BCCI సెలెక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. సంజూ శాంసన్‌తో పాటు మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను కూడా కెప్టెన్సీ ఎంపికల నుంచి సెలెక్టర్లు దాదాపు పక్కన పెట్టినట్లు సమాచారం.

సెలెక్టర్ల అభిప్రాయం ప్రకారం సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లు అంతర్జాతీయ క్రికెట్‌లో దీర్ఘకాలం స్థిరమైన ప్రదర్శన ఇవ్వగలరనే నమ్మకం తక్కువగా ఉందని, అందువల్ల వీరిని సుదీర్ఘ కాలం జట్టును నడిపించే కెప్టెన్సీ మెటీరియల్‌గా భావించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేసులో ప్రధానంగా ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే మిగిలారు – ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, తెలుగు యువ ఆటగాడు తిలక్ వర్మ. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు భవిష్యత్ టీ20 కెప్టెన్‌గా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇక గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్‌ల మధ్య గతంలో నుంచే కొన్ని విభేదాలు ఉన్నాయన్న వార్తలు కూడా మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‌లో కోల్కతా కింగ్స్ రైడర్స్ (KKR) జట్టును శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, గౌతమ్ గంభీర్ టీమ్ మెంటార్‌గా విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఆ విజయానికి గల క్రెడిట్ ఎక్కువ భాగం గంభీర్ ఖాతాలోకే వెళ్లిందన్న భావనతో శ్రేయస్ అసంతృప్తిగా ఉన్నాడని, ఆ సమయంలోనే ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు చెలరేగాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే నేపథ్యం కారణంగా గంభీర్ ఇప్పుడు శ్రేయస్‌కు టీ20 కెప్టెన్సీ ఇవ్వడంపై అంతగా ఆసక్తి చూపడం లేదన్న ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.

సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే, రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత 35 ఏళ్ల సూర్యకుమార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆయన నాయకత్వంలో భారత్ 2025 ఆసియ కప్ , 2026 ICC T20 వరల్డ్ కప్ టైటిళ్లను కైవసం చేసుకుంది. మొత్తం 52 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 42 విజయాలు సాధించి, సుమారు 84 శాతం విజయ శాతంతో సూర్యకుమార్ అత్యుత్తమ రికార్డు నెలకొల్పాడు. అయితే కెప్టెన్సీ భారం తీసుకున్న తర్వాత ఆయన బ్యాటింగ్ ఫామ్ గణనీయంగా పడిపోయింది. జూలై 2024 నుంచి ఇప్పటివరకు ఆడిన 45 టీ20 మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ 25.88 సగటుతో 932 పరుగులకే పరిమితమయ్యాడు. IPL 2026లో ముంబై ఇండియన్స్ తరఫున 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 270 పరుగులు మాత్రమే చేయడంతో, ఆయనపై ఉన్న నమ్మకం కొంత మేర తగ్గిందని, అందుకే కెప్టెన్సీ మార్పుపై BCCI సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

టీమిండియా రాబోయే షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని BCCI త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది. భారత్, ఐర్లాండ్ తో జూన్ 26, 28 తేదీల్లో రెండు టీ20 మ్యాచ్‌లు, తరువాత ఇంగ్లాండ్ తో జూలై 1 నుంచి 11 వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తం ఏడు టీ20ల సిరీస్‌లకు ముందే కొత్త కెప్టెన్ పేరును ప్రకటించాలని బోర్డు భావిస్తోంది.

ఈ నేపథ్యంలో రేపు BCCI గవర్నింగ్ కమిటీ అత్యవసర సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో గౌతమ్ గంభీర్ కోరుతున్నట్లుగా సంజూ శాంసన్‌కే పగ్గాలు అప్పగిస్తారా? లేక సెలెక్టర్లకు నచ్చిన శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మలలో ఎవరికైనా అదృష్టం కలిసివస్తుందా? అన్నది ఈ సమావేశం తర్వాత స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.