మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమ్‌ ఇండియా తన ప్రయాణాన్ని నేడు ఆరంభించబోతోంది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుండటంతో ఈ పోరుకు ప్రత్యేక ఆకర్షణ నెలకొంది. బర్మింగ్‌హామ్‌లో జరుగనున్న ఈ గ్రూప్‌–1 మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.

ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌–పాకిస్థాన్‌ పోరుకు ప్రత్యేక క్రేజ్‌ ఉంటుంది. పురుషుల క్రికెట్‌లో మాదిరిగానే మహిళల క్రికెట్‌లో కూడా ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌పై భారత్‌ ఆధిపత్యం కొనసాగిస్తుండటంతో ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

బర్మింగ్‌హామ్‌లో మహిళల టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమై రెండు రోజులు గడవగా, మూడో రోజు భారత్‌ రంగంలోకి దిగుతోంది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని భారత జట్టు ఆదివారం పాకిస్థాన్‌తో తలపడనుంది. ప్రత్యర్థి జట్టుకూ ఇదే టోర్నీలో తొలి మ్యాచ్‌. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత్‌ ఇప్పుడు టీ20 కిరీటంపై దృష్టి సారించింది. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్న భారత్‌ ఘన విజయంతో టోర్నీని ఆరంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారత జట్టు బలాన్ని పరిశీలిస్తే, స్మృతి మంధాన, షెఫాలి వర్మ రూపంలో దూకుడైన ఓపెనర్లు ఉన్నారు. తర్వాతి వరుసలో జెమీమా రోడ్రిగ్స్‌, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ల అనుభవం జట్టుకు పెద్ద బలం. మధ్యవరుసలో భార్తీ ఫుల్మాలి రూపంలో కొత్త హిట్టర్‌ దొరికింది. ఆమెకు తోడు రిచా ఘోష్‌ కూడా వేగంగా పరుగులు చేసే సామర్థ్యం కలిగిన బ్యాటర్‌. ఆల్‌రౌండ్‌ విభాగంలో దీప్తి శర్మ బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ కీలక పాత్ర పోషించగలదు.

స్పిన్‌ విభాగంలో దీప్తితో పాటు తెలుగమ్మాయి శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్‌ రూపంలో మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పేస్‌ విభాగంలో మాత్రం అనుభవం కొద్దిగా తగ్గింది. రేణుక సింగ్‌పై ఎక్కువ ఆశలు ఉన్నాయి. క్రాంతి గౌడ్‌, నందని శర్మ ప్రతిభావంతులే అయినా, అంతర్జాతీయ స్థాయిలో అనుభవం తక్కువ. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకుంటుందా లేదా అన్నది సందేహంగా ఉంది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తే శ్రేయాంక పాటిల్‌, పేస్‌కు అనుకూలిస్తే నందని శర్మకు తుది జట్టులో అవకాశం లభించే అవకాశం ఉందని అంచనా.

పాకిస్థాన్‌ జట్టును పరిశీలిస్తే, గతంతో పోలిస్తే పెద్దగా మార్పులు కనిపించడం లేదు. స్పిన్‌ విభాగంలో ఆ జట్టు బలం ఎక్కువ. ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో స్పిన్‌ బౌలర్లకు ఎంతమేర సహకారం లభిస్తుందోనన్నదే పాక్‌ జట్టు విజయావకాశాలను నిర్ణయించనుంది. కెప్టెన్‌ ఫాతిమా సనా నుంచి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనను పాక్‌ ఆశిస్తోంది. బ్యాటింగ్‌లో ముబీనా అలీ, ఆలియా రియాజ్‌ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు భారత్‌, పాకిస్థాన్‌ మహిళల జట్ల మధ్య జరిగిన 16 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌ 13 విజయాలు సాధించింది. ఈ గణాంకాలు కూడా హర్మన్‌ప్రీత్‌ సేనకు మానసిక బలాన్ని ఇస్తున్నాయి. మరోవైపు, ఇదే రోజున మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో బంగ్లాదేశ్‌ మధ్యాహ్నం 3 గంటలకు తలపడనుంది.

అంచనా తుది జట్లు:

భారత్‌: స్మృతి మంధాన, షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), భార్తీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్‌, శ్రేయాంక పాటిల్‌/నందని శర్మ, శ్రీ చరణి, రేణుక సింగ్‌, క్రాంతి గౌడ్‌.

పాకిస్థాన్‌: గుల్‌ ఫెరోజా, ముబీనా అలీ, నటాలియా, ఆలియా రియాజ్‌, ఫాతిమా సనా (కెప్టెన్‌), సైరా జబీన్‌, ట్యూబా హసన్‌, రమీన్‌ షమీమ్‌, సాదియా ఇక్బాల్‌, నష్రా సంధు, డయానా బేగ్‌.