టీ20 ఫార్మాట్‌లో వరుసగా రెండు ప్రపంచకప్‌లు కైవసం చేసుకున్న టీమ్ఇండియా ఇటీవలి కాలంలో అనూహ్యంగా పరాజయాలను చవిచూస్తోంది. టీ20 ప్రపంచకప్ 2026 అనంతరం భారత్ ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడగా ఒక్కదాంట్లోనూ విజయం సాధించలేకపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఐర్లాండ్ చేతిలో 2-0 తేడాతో, ఇంగ్లాండ్‌పై 4-0 తేడాతో భారత్ పరాజయాలు ఎదుర్కొంది.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా సిద్ధమైంది. భారత్, జింబాబ్వే జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. హరారే వేదికగా జరగనున్న ఈ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ ఇయర్ ఇప్పటి వరకు విజయాన్ని అందుకోలేదు. జింబాబ్వే సిరీస్‌లోనూ భారత్ ఓటమి పాలైతే అతని నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. మరోవైపు సీనియర్ ఆటగాడు సంజు శాంసన్ కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వడంతో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

ఈ సిరీస్‌లోని మూడు టీ20 మ్యాచ్‌లు హరారేలోనే జరగనున్నాయి. తొలి టీ20 మ్యాచ్ జూలై 23న, రెండో టీ20 జూలై 25న, మూడో టీ20 జూలై 26న నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం ప్రతి మ్యాచ్ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది.

భారత్–జింబాబ్వే టీ20 సిరీస్ ప్రసార హక్కులను జీ నెట్వర్క్ కు చెందిన యునైటెడ్ 8 స్పోర్ట్స్ దక్కించుకుంది. దీంతో టెలివిజన్‌లో యునైటెడ్8 స్పోర్ట్స్ ఛానళ్లలో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఓటీటీ పరంగా ఫ్యాన్ కోడ్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ మ్యాచ్‌ల స్ట్రీమింగ్ ఉంటుంది.

టీవీ, ఓటీటీ రెండింటిలోనూ ఈ సిరీస్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం లేదు. మ్యాచ్‌లను చూడాలంటే సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.