భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య ఏళ్ల క్రితం మొదలైన విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. 2023 డిసెంబర్‌లో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) మ్యాచ్‌లో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై శ్రీశాంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

ఆ మ్యాచ్ సందర్భంగా గౌతమ్ గంభీర్ తనను ‘ఫిక్సర్’ అని దూషించాడని శ్రీశాంత్ అప్పటికే ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను బయటపెట్టాడు. గంభీర్ తనను కేవలం ‘ఫిక్సర్’గానే కాకుండా, ‘దేశద్రోహి’ అని కూడా సంబోధించాడని శ్రీశాంత్ ఆరోపించాడు.

‘ ది లాల్లాంటోప్ ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ మ్యాచ్‌లో జరిగిన సంఘటనలను శ్రీశాంత్ వివరించాడు. మ్యాచ్‌లో తాను వేసిన ఒక బౌన్సర్‌ తర్వాతే ఈ గొడవ మొదలైందని తెలిపాడు.

“గౌతీ చాలా మంచి క్రికెటర్, నా ఆట తీరు అతనికి బాగా తెలుసు. అందుకే నేను వేసిన మొదటి బంతికే అతను ముందుకు వచ్చి ఫ్లిక్ షాట్ ఆడాడు. కోచింగ్ విషయంలో అతని ప్రతిభ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, ఒక క్రికెటర్‌గా మాత్రం అతను గొప్పోడే. ఆ షాట్ తర్వాత నేను అతనికి ఒక బౌన్సర్ వేశాను”

ఆ బౌన్సర్ వేసిన తర్వాత గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహానికి లోనై, తనపై అసభ్య పదజాలంతో దాడి చేశాడని శ్రీశాంత్ ఆరోపించాడు.

“ఆ బౌన్సర్ తర్వాత గంభీర్ నా వైపు చూస్తూ ‘I own you’ అన్నాడు. నన్ను స్పష్టంగా బూతులు తిట్టాడు. అసలు అనకూడని మాట అన్నాడు.. నన్ను ‘ఫిక్సర్’ అని పిలిచాడు”

అప్పుడు తాను గంభీర్‌కు దగ్గరగా వెళ్లి మాట్లాడిన విషయాన్ని కూడా శ్రీశాంత్ వివరించాడు.

“గౌతీ భాయ్, మీరు బానే ఉన్నారా?”

అలా అడిగినప్పటికీ, తాను ముందుకు రావడం గంభీర్‌కు దాడి చేయడానికి వస్తున్నట్లుగా అనిపించి ఉండవచ్చని శ్రీశాంత్ చెప్పాడు. అయితే గంభీర్ మాత్రం ‘F’ అక్షరంతో మొదలయ్యే అసభ్య పదాలు వాడుతూ, మళ్లీ తనను ‘ఫిక్సర్’, ‘దేశద్రోహి’ అని అరిచాడని శ్రీశాంత్ సంచలనంగా ఆరోపించాడు.

గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ ఇద్దరూ ఒకప్పుడు భారత జట్టు చారిత్రాత్మక విజయాల్లో భాగస్వాములైన ఆటగాళ్లు. 2007 T20 వరల్డ్ కప్,2011 వరల్డ్ కప్ విజేత జట్లలో వీరిద్దరూ కలిసి ఆడారు. అయితే ఆటగాళ్లుగా రిటైర్ అయిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చినట్లు ఈ తాజా వివాదం సూచిస్తోంది.

2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో శ్రీశాంత్‌పై వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంతోనే గంభీర్ ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని క్రికెట్ వర్గాల్లో భావిస్తున్నారు. ఆ కేసులో బోర్డు అఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) మొదట శ్రీశాంత్‌కు జీవితకాల నిషేధం విధించినప్పటికీ, తరువాత దానిని ఏడేళ్లకు తగ్గించింది. దీంతో 2020లో శ్రీశాంత్ తిరిగి క్రికెట్ ఆడే అర్హతను పొందాడు.