రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
టీం ఇండియాలో విభేదాలు?
గంభీర్‌ను దాటేసి బీసీసీఐ పెద్దల దరి చేరిన సీనియర్లు
టీం ఇండియా వన్డే జట్టులో అంతర్గత విభేదాలు, అస్పష్టతలు ముదురుతున్నాయన్న వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకాలలో భాగంగా భారత్ ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ తో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతుండగా, సిరీస్ ప్రారంభానికి ముందే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టెస్టులు, T20 ఫార్మాట్లలో పూర్తి పట్టు సాధించిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ , వన్డేల్లో మాత్రం ఇంకా అదే స్థాయి ప్రభావాన్ని చూపలేకపోతున్నారనే అభిప్రాయం జట్టు వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధత పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది.
తాజా సమాచారం ప్రకారం, జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్లు కోచ్ గౌతమ్ గంభీర్ ను పక్కనబెట్టి నేరుగా బోర్డు అఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) అగ్రనేతలను సంప్రదించినట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచ కప్‌లో తమ భవిష్యత్తు, జట్టులో తమ పాత్ర, ప్రణాళికలపై స్పష్టత ఇవ్వాలని వారు బోర్డు పెద్దలను కోరినట్లు ఆ నివేదికలో పేర్కొంది.
రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ ఇప్పటికే T20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో వీరిద్దరి ప్రయాణం ఎలా ఉండబోతోందనే అంశంపై మొదటి నుంచీ సందేహాలే ఎక్కువగా ఉన్నాయి. కోచ్ గౌతమ్ గంభీర్ అవలంబిస్తున్న వ్యూహాలు, సెలక్షన్ కమిటీ అమలు చేస్తున్న నిబంధనలే ఈ ఇద్దరు దిగ్గజాల కెరీర్ మార్పుకు కారణమయ్యాయనే చర్చ కొనసాగుతోంది.
ఇటీవల ముగిసిన IPL 2026 సీజన్లో రాయల్ చల్లేంగెర్స్ బెంగుళూరు తరఫున ఆడిన విరాట్ కోహ్లీ , తాను మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరం లేని స్థితిలో ఉన్నానని స్పష్టంగా చెప్పాడు. మరోవైపు, ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ విజయంలో రోహిత్ శర్మ ప్రదర్శించిన నిస్వార్థ ఆటతీరు, ప్రస్తుత వన్డే క్రికెట్లో కొంత మారినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీం మేనేజ్మెంట్, సీనియర్ ఆటగాళ్ల మధ్య పూర్తి స్థాయి అవగాహన ఇంకా కుదరలేదని జట్టు వర్గాల సమాచారం. సీనియర్లు నేరుగా BCCI పవర్ సెంటర్లతో టచ్‌లోకి వెళ్లడం, కోచ్ గంభీర్ తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ను కూడా ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టిందని చెప్పబడుతోంది.
ఇప్పుడైనా వన్డే ప్రపంచ కప్ సన్నాహకాలపై పూర్తి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ , గిల్ ఇద్దరూ బాధ్యత తీసుకుని డ్రెస్సింగ్ రూమ్‌లో తమ ఆలోచనలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఇన్నేళ్లుగా దేశానికి సేవలందించిన సీనియర్ ఆటగాళ్లకు రాబోయే 16 నెలల్లో జట్టు వారి నుంచి ఏమి ఆశిస్తోంది, వారి పాత్ర ఏమిటి అనే విషయాలను ముందుగానే వివరించడం అత్యంత కీలకమని BCCI వర్గాలు భావిస్తున్నాయి.







