రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: తెలంగాణ క్రికెట్ అభిమానుల కోసం కొత్తగా రూపుదిద్దుకున్న టీజీ20 లీగ్ ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ లక్ష్యం రాష్ట్ర యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే. తొలి సీజన్ ఆరంభ వేడుకలు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో వైభవంగా జరిగాయి.
లీగ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ నటుడు విజయ్ దేవరకొండ హాజరై అభిమానులతో సందడి చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ సంగీత ప్రదర్శనతో స్టేడియం కిక్కిరిసిపోయింది. తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వరినాథ్, టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఆగంరావు, హెచ్‌సీఏ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు, భారత జట్టు పేసర్ మహ్మద్ సిరాజ్, హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌రెడ్డి, టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు సంజీవ్ రెడ్డి తదితరులు ఆరంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మొదట టీజీ20 ట్రోఫీని మైదానంలోకి తీసుకురావడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం లీగ్‌లో పాల్గొనే ఎనిమిది జట్ల ఆటగాళ్లు, ఫ్రాంఛైజీ యాజమానులు అభిమానులకు పరిచయం అయ్యారు. తారల తళుకులతో నిండిన ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను ఆస్వాదించారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క టీజీ20 లీగ్ నిర్వహణను అభినందించారు. తెలంగాణలోని యువ క్రీడాకారులకు ఇది మంచి వేదికగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలోని యువ క్రీడాకారులందరికీ ఇది గొప్ప వేదిక. టోర్నీ నిర్వాహకులకు నా అభినందనలు. అందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. క్రీడాకారుల ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వ సహకారం ఎప్పటికీ ఉంటుంది.
టీజీ20 బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ కూడా లీగ్ ప్రాధాన్యాన్ని వివరించారు. తెలంగాణ నుంచి మరింత మంది ఆటగాళ్లు జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
నా చిన్నప్పుడు కర్ణాటక నుంచి భారత్‌కు నలుగురు ప్రాతినిధ్యం వహించేవారు. తెలంగాణ నుంచి వీవీఎస్ లక్ష్మణ్ మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్ లాంటి వారు భారత్‌కు ఆడుతున్నారు. తెలంగాణ నుంచి మరింత మంది జాతీయ జట్టుకు ఆడాలనేది నా ఆకాంక్ష. అందుకు ఈ లీగ్ దోహదపడుతుందని ఆశిస్తున్నా.
టీజీ20 లీగ్ అధికారిక టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిందని, దీనికి బీసీసీఐ అనుమతి ఇచ్చిందని బోర్డు అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వరినాథ్ తెలిపారు. ఆరంభ వేడుకలలో భాగంగా ఎస్.ఎస్. తమన్ సంగీత ప్రదర్శనతో పాటు లేజర్, క్రాకర్స్ షోలు నిర్వహించగా, ప్రేక్షకులు ఉత్సాహంగా స్పందించారు.
టీజీ20 ఆరంభ వేడుకల్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ప్రతినిధులుగా ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ సాంబశివరావు, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, ఈటీవీ డైరెక్టర్ సుజయ్ పాల్గొన్నారు.
ఆరంభ వేడుకల అనంతరం జరిగిన తొలి మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్ జట్టు 20 పరుగుల తేడాతో పాలమూరు స్ట్రైకర్స్‌పై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఖమ్మం ఏసెస్ ఆధిక్యాన్ని నిలబెట్టుకుని టీజీ20 లీగ్ తొలి మ్యాచ్‌లో విజేతగా నిలిచి సిరీస్‌కు విజయవంతమైన శ్రీకారం చుట్టింది.







