రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: అమరావతి అంచెలో ఆంధ్ర ప్రిమియర్ లీగ్ చివరి దశ పోరులు రసవత్తరంగా సాగుతున్నాయి. బుధవారం జరిగిన రెండు మ్యాచ్‌లూ ఉత్కంఠభరితంగా ముగిశాయి. రెండింటిలోనూ గెలిచిన జట్లు ప్రత్యర్థులపై కేవలం నాలుగు పరుగుల తేడాతోనే విజయం సాధించడం విశేషంగా నిలిచింది.
మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు, రాయల్స్ అఫ్ రాయలసీమ జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వైజాగ్ లయన్స్ తరఫున రికీ భూమి అజేయ శతకంతో మెరిశాడు. అతడు 57 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 111 పరుగులు సాధించాడు. చివర్లో ధనుష్ 12 బంతుల్లో 3 సిక్సర్లతో 26 నాటౌట్ చేసి జట్టు స్కోరును మరింత ముందుకు నడిపించాడు. దీంతో వైజాగ్ లయన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 190 పరుగులు చేసింది. రాయల్స్ అఫ్ రాయలసీమ బౌలర్లలో యడ్ల వాసు రెండు వికెట్లు తీశాడు.
లక్ష్య ఛేదనలో రాయల్స్ అఫ్ రాయలసీమ పోరాడినా, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో గరిమెళ్ళ తేజ 38 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 62 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. వైజాగ్ లయన్స్ బౌలర్లలో బోధల వినయ్ 2/34, కామిల్ షేక్ 2/35తో ప్రభావవంతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి పరుగుల ప్రవాహాన్ని అడ్డుకున్నారు.
రాత్రి జరిగిన మరో మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగింది. క్యాపిటల్స్ అమరావతి రాయల్స్ జట్టు, భీమవరం బుల్స్ పై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అమరావతి జట్టులో సీరం వెంకట రాహుల్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. యర్రా సందీప్ 33 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు, అవినాష్ పైలా 18 బంతుల్లో 3 సిక్సర్లతో 28 పరుగులు చేసి జట్టు స్కోరును 5 వికెట్లకు 215 పరుగుల వరకు చేర్చారు. భీమవరం బుల్స్ తరఫున రవికిరణ్ , సత్యనారాయణ రాజు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
తర్వాత బ్యాటింగ్ చేసిన భీమవరం బుల్స్ లక్ష్యాన్ని చేరేందుకు బలంగా ప్రయత్నించింది. హేమంత్ రెడ్డి 23 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 38 పరుగులు, కశ్యప్ ప్రకాష్ 22 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 45 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. మునీష్ వెర్మ 32 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 నాటౌట్ చేసి చివరి వరకు పోరాడినా, చివరి ఓవర్లలో జట్టు తడబడి లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలోనే ఆగిపోయింది. భీమవరం బుల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. అమరావతి రాయల్స్ బౌలర్లలో అహితేశ్ వెర్మ 3/19, బండారు అయ్యప్ప 2/5తో కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి పునాది వేశారు.
రెండో మ్యాచ్‌కు ముందు ACA స్టేడియంలో సినీ నటుడు రామ్ చరణ్ హాజరై సందడి చేశారు. ఆయన టాస్ నిర్వహించి మ్యాచ్‌ను ప్రారంభించారు. అనంతరం APL ట్రోఫీలు, జెర్సీలను ఆవిష్కరించారు. అమరావతిలో జరుగుతున్న ఈ చివరి దశ పోరులతో ఆంధ్ర ప్రిమియర్ లీగ్ ఉత్కంఠ మరింత పెరిగింది.







