నిర్లక్ష్యంగా నడిపిన బస్సు.. నిండు ప్రాణం బలి

విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బస్‌స్టేషన్‌ ప్రాంగణంలో ప్రయాణికులు తిరుగుతున్నా పట్టించుకోకుండా డ్రైవర్‌ దురుసుగా బస్సు నడిపిన ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గోవిందనగర్‌కు చెందిన బులు సాహు (42) పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో వెనుకవైపు ఉన్న సిటీ బస్‌ టెర్మినల్‌ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో అవనిగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు అక్కడికి చేరింది. బస్‌స్టేషన్‌ లోపలే ఉన్న స్పీడ్‌బ్రేకర్‌ను కూడా పట్టించుకోకుండా డ్రైవర్‌ వేగంగా బస్సు నడిపాడు.

ఈ క్రమంలో బస్సు బులు సాహును ఢీకొట్టింది. బస్సు ఎడమ వైపు చక్రాలు అతని తలపైకి ఎక్కడంతో సాహు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే బస్‌స్టేషన్‌ ప్రాంగణంలో ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. బస్సు కింద చిక్కుకున్న సాహును బయటకు తీసేసరికి అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు.

సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద నుంచి ఆధార్‌కార్డు, సిమ్‌ కార్డు లేని మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బులు సాహు కుటుంబసభ్యులకు సమాచారం అందించేందుకు ఒడిశాలోని గంజాం పోలీసులను సంప్రదిస్తున్నట్లు తెలిపారు.

ప్రమాదానికి కారణమైన బస్‌ డ్రైవర్‌ పులి లక్ష్మీవరప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్‌స్టేషన్‌ వంటి రద్దీ ప్రదేశంలో కూడా కొంతమంది డ్రైవర్లు హైవేపై నడిపినట్లు వేగంగా బస్సులు నడుపుతున్నారని, తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బస్‌స్టేషన్‌లో ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బస్సులు నెమ్మదిగా నడపాలని, స్పీడ్‌బ్రేకర్ల వద్ద తప్పనిసరిగా వేగం తగ్గించాలని అధికారులు పలుమార్లు సూచించినప్పటికీ కొందరు డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో బస్‌స్టేషన్‌ భద్రతా ఏర్పాట్లు, డ్రైవర్లపై పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.